![]() |
![]() |

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ తెరంగేట్రం చేసి దాదాపు పాతికేళ్ళు కావస్తోంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం `ఇరువర్` (తెలుగులో `ఇద్దరు` పేరుతో అనువాదమైంది)తో నటనకు శ్రీకారం చుట్టిన ఐష్.. హిందీ, తమిళ్, తెలుగు, బెంగాలి, ఆంగ్ల భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు సుమారు 50 సినిమాల్లో అభినయించింది. వీటిలో ప్రత్యేక గీతాలు చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంత ఫిల్మోగ్రఫీలో ఈ నీలికళ్ళ సుందరి.. ఒకే ఒక సినిమా కోసం డ్యూయెల్ రోల్ లో సందడి చేసింది. ఆ చిత్రం మరేదో కాదు.. ఆమె నటించిన మొదటి సినిమా `ఇరువర్`. అందులో కథానాయకుడి (మోహన్ లాల్) శ్రీమతి పుష్పవల్లిగా, సినిమా నటి కల్పనగా రెండు విభిన్న వేషాల్లో అలరించింది ఐష్.
ఆ తరువాత మళ్ళీ ద్విపాత్రాభినయం చేయని ఈ అభినేత్రి.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న తమిళ చారిత్రక చిత్రం `పొన్నియన్ సెల్వన్` కోసం డబుల్ రోల్ ప్లే చేస్తోంది. దీనికి కూడా మణిరత్నంనే దర్శకుడు కావడం విశేషం. ఇందులో తల్లీకూతుళ్ళైన నందిని, మందాకిని దేవీ పాత్రల్లో ఐశ్వర్యా రాయ్ కనిపించనుంది. 24 ఏళ్ళ తరువాత ఐష్ చేస్తున్న ఈ ద్విపాత్రాభినయ ప్రయత్నం ఆమెకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న `పొన్నియన్ సెల్వన్`కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ `పీఎస్ 1` వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
అన్నట్టు.. `జీన్స్`లోనూ ఐష్ ఓ పాట కోసం కవల సోదరీమణులుగా దర్శనమిస్తుంది. కాకపోతే అందులో ఒక పాత్ర గ్రాఫిక్స్ ఆధారితమైన ఫేక్ రోల్. అందుకే.. దీన్ని డ్యూయెల్ రోల్ కింద జమకట్టడం లేదు విశ్లేషకులు. అదీ సంగతి!
![]() |
![]() |