`పోకిరి` (2006) వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సరైన విజయం లేని సూపర్ స్టార్ మహేశ్ బాబుని మళ్ళీ సూపర్ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన చిత్రం `దూకుడు`(2011). ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీలో పోలీసాఫీసర్ గా, ఎమ్మెల్యేగా, ఫిల్మ్ మేకర్ గా మూడు విభిన్న ఛాయలున్న పాత్రలో ఆకట్టుకున్నారు మహేశ్. ఇక తండ్రి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అలరించారు. మహేశ్ కి జోడీగా సమంత నటించిన ఈ సినిమాలో సోనూ సూద్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సోనియా, నాజర్, చంద్రమోహన్, భరణి, సుమన్, నాగబాబు, వెన్నెల కిశోర్, కోట శ్రీనివాసరావు, అజయ్, మాస్టర్ భరత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. పార్వతి మెల్టన్ ఓ ప్రత్యేక గీతంలో చిందులేసింది. శ్రీనువైట్ల దర్శకత్వం, తమన్ సంగీతం, కేవీ గుహన్ - ప్రసాద్ ఛాయాగ్రహణం, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణ విలువలు.. వెరసి `దూకుడు`ని బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిపాయి. నేటి(సెప్టెంబర్ 23)తో ఈ సెన్సేషనల్ హిట్ పదేళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా.. `దూకుడు`కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..
* శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేశ్ నటించిన మొదటి సినిమా ఇదే. ఆ తరువాత వీరిద్దరి కలయికలో `ఆగడు` (2014) వచ్చింది.
* మహేశ్ - సమంత జంటగా నటించిన తొలి చిత్రమిది. ఆపై `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013), `బ్రహ్మోత్సవం` (2016) సినిమాలు వీరి కలయికలో రూపొందాయి.
* మహేశ్ బాబు - తమన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇదే. ఆపై `బిజినెస్ మేన్` (2012), `ఆగడు` (2014) చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సర్కారు వారి పాట`తో పాటు రాబోయే త్రివిక్రమ్ డైరెక్టోరియల్ కోసం ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టారు.
* ఈ చిత్రం వేర్వురు విభాగాల్లో ఏడు `నంది` పురస్కారాలు, ఆరు `ఫిల్మ్ ఫేర్` అవార్డులు అందుకుంది. `ఉత్తమ నటుడు`గా మహేశ్ బాబు.. ఇటు నందిని, అటు ఫిల్మ్ ఫేర్ ని అందుకోవడం విశేషం.
* బెంగాలీలో `ఛాలెంజ్ 2` టైటిల్ తో, కన్నడలో `పవర్` పేరుతో `దూకుడు` రీమేక్ అయింది.
* ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్స్ ఆర్జించిన మొదటి తెలుగు సినిమాగా `దూకుడు` ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఆపై పలు తెలుగు చిత్రాలు ఇదే బాట పట్టాయి. వాటిలో కొన్ని నయా రికార్డులు కూడా సృష్టించాయి.