స్టార్ మా చానల్‌లో ప్రసారం కానున్న బిగ్ బాస్ 4 తెలుగు గేమ్ షో ఎప్పుడు మొదలవుతుందా అని దాని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల నిర్వాహకులు ప్రోమో కూడా రిలీజ్ చేయడంతో త్వరలోనే ఆ షో తమ ముందుకు వస్తుందనీ, అందులో కంటెస్టెంట్ల రూపంలో ఉన్న సెలబ్రిటీల విన్యాసాలు చూడవచ్చనీ వారు ఆశిస్తున్నారు. సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున ఈ నాలుగో సీజన్‌కు సైతం హోస్ట్‌గా వ్యవహరించడం ఖాయమైంది. బిగ్ బాస్ తెలుగు వెర్షన్‌కు హోస్ట్ రిపీటవడం ఇదే మొదటిసారి.
బిగ్ బాస్ 3 వంద ఎపిసోడ్లకు పైగా వీక్షకుల్ని అలరించగా, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ఈసారి షోను సగం ఎపిసోడ్లకు కుదించారు. కంటెస్టెంట్లు కూడా పన్నెండు మందే ఉండనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్ట్ 30న కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారు. అంటే ఆగస్ట్ 31 నుంచి ఈ షో మన ముందుకు రానున్నది.
ఇదివరకటితో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్లకు పారితోషికం ఎక్కువగానే అందనున్నది. కారణం.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లక ముందే వారు 14 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాల్సి రావడం. కొవిడ్-19 నెగటివ్‌గా తేలినవారే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. దీని కోసం ఇప్పటి నుంచే నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కంటెస్టెంట్లుగా బయట ప్రచారం అవుతున్న పేర్లలో కొంతమందిని నిర్వాహకులు అసలు సంప్రదించలేదని తెలిసింది. అలాగే ఇప్పటి దాకా పేర్లు బయటకు రానివారు ఈ షోలో ప్రత్యక్షం కానున్నారు.