Home  »  News  »  సుప్రీంకోర్టు కీలక తీర్పు: దిల్ రాజు సేఫ్ జోన్ లో ఉన్నట్టేనా! 

Updated : Aug 12, 2026

 

 


హిట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్స్ దిల్ రాజు. బాలీవుడ్ లో కూడా తన విజయ పరంపర కొనసాగించాలని ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు గత చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన  'మిస్టర్ పర్ఫెక్ట్' ఒకటి. 2011లో విడుదలవ్వగా దశరథ్ దర్శకత్వం వహించాడు . అయితే, సినిమా విడుదలైన దాదాపు 6 సంవత్సరాల తర్వాత మొదలైన కాపీరైట్ వివాదం గత కొన్నేళ్లుగా నిర్మాత దిల్ రాజును, దర్శకుడు దశరథ్‌ను న్యాయస్థానాల చుట్టూ తిప్పుతోంది. ఈ కేసులో తాజాగా భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో దిల్ రాజుకు ఊరట లభించే కీలక పరిణామం చోటుచేసుకుంది.  


ప్రముఖ  రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి 2010 ఆగస్టులో 'నా మనసు కోరింది నిన్నే' అనే నవలని ప్రచురించారు. అయితే తన నవలలోని కథ, సన్నివేశాలు, ప్రధాన భావోద్వేగాలు, డైలాగులని నా అనుమతి లేకుండా కాపీ కొట్టి తీశారంటూ శ్యామలారాణి 2017 జులై 12న మియాపూర్ కోర్టుని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్, సంభాషణల రచయిత అబ్బూరి రవిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి (కుట్ర), సెక్షన్ 420 (మోసం) తో పాటు కాపీరైట్ చట్టం సెక్షన్ 63 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.  


ఈ పిటిషన్ ఆధారంగా విచారణ ప్రారంభించిన ట్రయల్ కోర్టు (సిటీ సివిల్ కోర్టు), 2019లో దిల్ రాజు మరియు ఇతరులపై చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసింది. తమ ప్రతిష్టకు భంగం కలుగుతోందని, అసలు సినిమా విడుదలైన 6 సంవత్సరాల తర్వాత ఈ కేసు నమోదు చేయడం కాలపరిమితి (స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్) దాటిపోయిందని పేర్కొంటూ దిల్ రాజు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన హైకోర్టు, ఐపీసీ సెక్షన్ 420 కింద ఉన్న చీటింగ్ ఆరోపణలను తొలగించి దిల్ రాజుకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, కాపీరైట్ చట్టం సెక్షన్ 63 కింద ట్రయల్ కోర్టులో విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.  


హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 468 ప్రకారం కేసుకు సంబంధించిన కాలపరిమితి ముగిసినందున విచారణను కొట్టివేయాలని వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టు విచారణపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ స్టేను ఎత్తివేసి విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని పిటిషనర్ శ్యామలారాణి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.  ఈ అభ్యర్థనపై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో స్టే ఇచ్చే ముందే ఇరుపక్షాల వాదనలు, కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, కాలపరిమితి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని స్పష్టం చేస్తూ, స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు చర్యలపై విధించిన స్టే కొనసాగనుంది. 2011లో థియేటర్లలో విడుదలైన సినిమాకు సంబంధించి దాదాపు 15 సంవత్సరాల తర్వాత కూడా కాపీరైట్ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుండగా, సర్వోన్నత న్యాయస్థానం విధించిన స్టే కొనసాగడం దిల్ రాజుకు తాత్కాలికంగా పెద్ద ఊరటగా మారింది.

Dil Raju, Prabhas, Dasaradh, Mister Perfect

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.