Home  »  News  »  సుధా కొంగర సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ వివాదంపై కోర్టుకు వెళ్లిన డైరెక్టర్!

Updated : Jun 30, 2026

ప్రముఖ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) కోర్టు మెట్లు ఎక్కడం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. శివకార్తికేయన్, శ్రీలీల ముఖ్య పాత్రల్లో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ డ్రామా 'పరాశక్తి' (Parasakthi) కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా విషయంలో తనకు రావాల్సిన పారితోషికం మేకర్స్ పూర్తిగా చెల్లించలేదని డైరెక్టర్ సుధా కొంగర మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన రెమ్యునరేషన్ బకాయిల విషయంలో ఆమె న్యాయపోరాటానికి దిగడంతో ఈ వివాదం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

నిర్మాణ సంస్థ 'డాన్ పిక్చర్స్'తో జరిగిన ఒప్పందంలో సుధా కొంగర పారితోషికాన్ని 15 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. దీనికి జీఎస్టీ (GST) కూడా తోడవడంతో మొత్తం పారితోషికం విలువ 17.70 కోట్ల రూపాయలకు చేరింది. అయితే ఈ భారీ మొత్తంలో నిర్మాణ సంస్థ ఇప్పటివరకు కేవలం 9.31 కోట్ల రూపాయలను మాత్రమే సుధా కొంగరకు చెల్లించినట్లు ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఒప్పందం ప్రకారం ఇంకా 8.39 కోట్ల రూపాయల భారీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, సినిమా విడుదలై ఐదు నెలలు గడుస్తున్నా ఆ డబ్బును చెల్లించడంలో నిర్మాతలు తాత్సారం చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు జస్టిస్ కుమరేష్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'పరాశక్తి' సినిమా ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో (OTT) స్ట్రీమింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, దీనికి సంబంధించిన శాటిలైట్ హక్కుల ప్రసారాన్ని నిలిపివేయాలని కోర్టు సూచించింది. జూలై 8 వరకు ఈ సినిమా శాటిలైట్ విడుదలను హోల్డ్‌లో పెట్టాలని ఆదేశిస్తూ, దీనిపై స్పందన తెలియజేయాలని నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్‌ను కోరింది. జూలై 7 లోగా ప్రొడక్షన్ హౌస్ తన లిఖితపూర్వక సమాధానాన్ని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ వివాదం కేవలం 'పరాశక్తి' సినిమాతోనే ఆగడం లేదు. డాన్ పిక్చర్స్ నిర్మిస్తున్న మరో చిత్రంపై కూడా దీని ప్రభావం పడేలా కనిపిస్తోంది. హీరో అథర్వ నటిస్తున్న 'ఇదయం మురళి' అనే సినిమాను జూలై 10న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే తమ బకాయిలు చెల్లించే వరకు ఈ కొత్త సినిమా విడుదలను కూడా నిలిపివేయాలంటూ సుధా కొంగర కోర్టులో కోరారు. నిర్మాతలు చివరి నిమిషంలో ఇబ్బందులు పడుతున్నామని నెపం నెట్టకుండా ఉండేందుకే, తాము ముందే కోర్టును ఆశ్రయించినట్లు ఆమె తరఫు లాయర్లు స్పష్టం చేశారు. ఈ డ్రామా మొత్తం ఇప్పుడు కోలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మధ్య హాట్ డిబేట్‌కు దారితీసింది. జూలై 8న జరిగే తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.