![]() |
![]() |

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో ఒక భారీ పౌరాణిక చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అని పిలుస్తున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో వదిలిన ఒక కాన్సెప్ట్ క్యాప్షన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక పెద్ద వివాదానికి, చర్చకు దారితీసింది. పౌరాణిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. “ఉత్తరాదిన జన్మించాడు.. హృదయభూమిలో రూపుదిద్దుకున్నాడు.. దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు.. ఇప్పుడు విశ్వానికి చెందాల్సిన కథ” అంటూ నాగవంశీ పెట్టిన పోస్ట్ ముఖ్యంగా తమిళ నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
తమిళ సంస్కృతిలో మురుగన్ దేవుడికి అత్యంత ప్రత్యేకమైన, భావోద్వేగభరితమైన స్థానం ఉంది. తమిళ ప్రజలు ఆయనను 'తమిళ్ కడవుల్' (తమిళుల దేవుడు) అని ఎంతో భక్తితో పిలుచుకుంటారు. ప్రాచీన సంగం సాహిత్యంలో (క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 300 వరకు) మురుగన్‌ను 'సేయోన్' అని, కొండ ప్రాంతాలైన కురింజి భూములకు, యుద్ధానికి, యవ్వనానికి అధిపతిగా అభివర్ణించారు. అందువల్ల, "ఉత్తరాదిన జన్మించాడు" (Born in the North) అనే వాక్యం తమ సంస్కృతిని, చరిత్రను విస్మరించడమేనని, సినిమా వాణిజ్య ప్రయోజనాల కోసం, పాన్-ఇండియా మార్కెట్ కోసం చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తున్నారని తమిళ నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరైతే ఈ చిత్రాన్ని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో అసలు ప్రశ్న ఏమిటంటే.. స్కందుడు, కార్తికేయుడు, మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి అందరూ వేర్వేరు దేవుళ్ళా? లేక ఒక్కరేనా? హిందూ పురాణాలు, చారిత్రక ఆధారాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి?
విస్తృతమైన హిందూ పురాణాలను, వేద సంప్రదాయాలను పరిశీలిస్తే.. స్కందుడు, కార్తికేయుడు, మురుగన్ అందరూ ఒక్కరేనని స్పష్టమవుతుంది. అయితే కాలక్రమంలో భిన్న ప్రాంతీయ సంస్కృతులు ఆయనను తమదైన శైలిలో స్వీకరించాయి. ఉత్తరాది పురాణాల ప్రకారం, పరమశివుడు-పార్వతీ దేవిల తేజస్సు నుండి, తారకాసురుడిని వధించడానికి హిమాలయాల్లోని శరవణ భవ అనే సరస్సులో కార్తికేయుడు జన్మించాడు. ఆరు ముఖాలు ఉన్నందున ఆయనను షణ్ముఖుడని, కృత్తిక నక్షత్ర దేవతల పెంచబడటం వల్ల కార్తికేయుడని, శివుని శక్తి స్కందం (జారిపడటం) వల్ల జన్మించడం వల్ల స్కందుడని పిలిచారు. ఉత్తరాది మరియు సంస్కృత పురాణాలైన స్కంద పురాణంలో ఈ కథే ప్రముఖంగా కనిపిస్తుంది. ఉత్తర భారతంలో ఈయన్ను ప్రధానంగా కార్తికేయుడు లేదా స్కంద దేవుడిగా గుర్తిస్తారు. ఇక్కడే ఉత్తరాది పురాణ మూలాలకు, దక్షిణాది ఆరాధనా పద్ధతులకు మధ్య ఉన్న అనుసంధానం స్పష్టమవుతుంది.
మరోవైపు దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో మురుగన్ ఆరాధన అనేది కేవలం ఒక మతపరమైన అంశం మాత్రమే కాదు, అదొక సాంస్కృతిక అస్తిత్వం. ప్రాచీన ద్రావిడ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉన్న మురుగన్ ఆరాధనను, కాలక్రమంలో వైదిక సంప్రదాయంలోని శివపార్వతుల కుమారుడైన స్కందుడి కథతో సమన్వయం చేశారు. తమిళనాడులో మురుగన్‌కు గల ఆరు పవిత్ర క్షేత్రాలను 'ఆరుపడై వీడు' అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈయన్ను సుబ్రహ్మణ్య స్వామిగా లేదా కుమారస్వామిగా పూజిస్తారు. అంటే, ఉత్తరాదిన పుట్టిన పౌరాణిక గాథను, దక్షిణాది తన భక్తి సంప్రదాయంలో అత్యున్నత శిఖరానికి చేర్చి విశ్వవ్యాప్తం చేసింది.
నిర్మాత నాగవంశీ తన పోస్ట్‌లో పేర్కొన్న "ఉత్తరాదిన జన్మించాడు, దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు" అనే మాట హిందూ పురాణాల్లోని భౌగోళిక ప్రయాణాన్ని సూచిస్తుందే తప్ప, తమిళ సంస్కృతిని తక్కువ చేయడం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కొన్ని నెలల క్రితమే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆనంద్ బాలసుబ్రమణియన్ రాసిన "మురుగన్: ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విస్డమ్" అనే పుస్తకంతో కనిపించడం, ఆయన ఈ పాత్ర కోసం ఎంత లోతుగా రీసెర్చ్ చేస్తున్నారో తెలియజేస్తుంది. ఈ సినిమా కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాకుండా భారతదేశం గర్వించేలా అద్భుతమైన పౌరాణిక కావ్యంగా రూపుదిద్దుకుంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు.
![]() |
![]() |