Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్

Updated : May 26, 2026

1. ఎట్టకేలకు బుల్లితెరపైకి దేవర
జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'దేవర' శాటిలైట్ హక్కులకు సంబంధించిన డీల్ ఎట్టకేలకు క్లోజ్ అయింది. థియేటర్లలో విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఇంతవరకు ఈ సినిమా టీవీలో ప్రసారం కాకపోవడం విశేషం. ఈ సినిమాను బుల్లితెరపై చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రముఖ టీవీ నెట్‌వర్క్ 'ఈటీవీ', ఈ సినిమా శాటిలైట్ హక్కులకు సొంతం చేసుకుంది. భారీ ధరకే ఈ డీల్ కుదిరినట్లు సమాచారం.

2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్లు న్యూస్ వినిపిస్తోంది. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' సినిమా చేస్తుండగా.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

3. 'పెద్ది' సినిమాకు రూట్ క్లియర్
మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ మూవీ 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది. థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ సిస్టమ్‌పై చర్చలు జరుగుతున్నా.. తెలంగాణలో ఈ సినిమా పాత రెంటల్ విధానంలోనే రిలీజ్ కాబోతోంది. ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో పర్సంటేజ్ సిస్టమ్‌ అమలుకు సంబంధించిన నిబంధనలపై చర్చలు సాగుతున్నాయి. అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షించి రాబోయే జులై నెల నుండి కొత్త పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.

4. మంచు మనోజ్ కాదు.. మంచి మనోజ్
మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్ లోని 'మాతృదేవోభవ' అనాథాశ్రమాన్ని సందర్శించారు. సోషల్ మీడియాలో ఆశ్రమ నిర్వాహకులు పెట్టిన వీడియో చూసి చలించిన ఆయన, అక్కడ మతిస్థిమితం లేని ఒక వ్యక్తికి స్వయంగా కటింగ్ చేసి, కొత్త బట్టలు అందించారు. ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను విరాళంగా ఇవ్వడంతో పాటు భవిష్యత్తులోనూ తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

5. పెద్దికి అంకితమైపోయిన అప్పలసూరి
'పెద్ది' సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డబ్బింగ్ స్టూడియోలో దర్శకుడు బుచ్చిబాబు పర్యవేక్షణలో సాగుతున్న ఈ డబ్బింగ్ వీడియోను షేర్ చేస్తూ.. "పెద్దికి అంకితమైపోయిన అప్పలసూరి" అని ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

6. 'ది డర్టీ పిక్చర్'లో చూపించింది అబద్ధం
నాటి గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత తనను కొట్టిందంటూ చాలాకాలంగా ప్రచారంలో ఉన్న వివాదంపై నటి షకీలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 'ది డర్టీ పిక్చర్' సినిమాలో చూపించినట్లుగా తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులం కాదని, సిల్క్ స్మిత తనకు ఎంతో ఆత్మీయురాలని షకీలా స్పష్టం చేశారు. ఒక సినిమా షూటింగ్ సీన్‌లో భాగంగా సిల్క్ స్మిత తనను నిజంగానే గట్టిగా తన్నాల్సి వచ్చిందని, అయితే షాట్ పూర్తయిన వెంటనే ఆమె తనను కౌగిలించుకుని ఓదార్చిందని షకీలా చెప్పారు.

7. చేతులు కలిపిన థమన్, అనిరుధ్
ఎస్.ఎస్. థమన్, అనిరుధ్ రవిచందర్ కలయికపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'మిత్రమా ఇక మొదలెడదామా' అంటూ అనిరుధ్‌ను ట్యాగ్ చేస్తూ.. థమన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి కాంబోలో ఏదో పెద్ద ప్రాజెక్ట్ రాబోతోందని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, థమన్ సంగీతం అందిస్తున్న ఒక సినిమాలో అనిరుధ్‌ కేవలం ఓ పాట పాడుతున్నట్లు సమాచారం.

8. త్వరలోనే 'కరుప్పు' సీక్వెల్ 
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'కరుప్పు' ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో పాల్గొన్న సూర్య.. ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. 'కరుప్పు 2' ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, దీనికి సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే వెల్లడవుతాయని సూర్య పేర్కొన్నారు.

9. సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళ సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి విజయ్ గుడ్ న్యూస్ చెప్పారు. తమిళనాడులో రోజుకు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చారు. జూన్ ఫస్ట్ నుండి ఇది అమలులోకి రానుంది. ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య ప్రేక్షకుడిపై అదనపు టికెట్ రేట్ల భారం పడకుండా, కలెక్షన్లు పెంచుకునేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

10. ధురంధర్ హీరోపై బాలీవుడ్ బ్యాన్
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ తలపెట్టిన 'డాన్ 3' ప్రాజెక్ట్ నుండి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభానికి ముందు ఆయన తప్పుకోవడంతో.. ప్రీ-ప్రొడక్షన్ దశలో నిర్మాతలకు దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నేపథ్యంలో 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్' రణ్‌వీర్‌పై నాన్-కోఆపరేషన్ ఆదేశాలు జారీ చేస్తూ బ్యాన్ విధించింది. ఇరువర్గాలు త్వరలోనే చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.