Home  »  News  »  పద్మ అవార్డుల వేడుకలో ఎమోషనల్ అయిన హేమమాలిని! 

Updated : May 26, 2026

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత కన్నుల పండువగా జరిగింది. రాష్టప్రతి భవన్‌లోని ప్రత్యేక ప్రాంగణంలో నిర్వహించిన ఈ సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు.

ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలకు దక్కిన గౌరవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా గతేడాది నవంబర్‌లో కన్నుమూసిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం 'పద్మవిభూషణ్' ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయన సతీమణి, సీనియర్ నటి హేమమాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కాస్త భావోద్వేగానికి గురయ్యారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు వెండితెరపై ధర్మేంద్ర అందించిన సేవలకు గాను ఈ అత్యున్నత గౌరవం దక్కింది.

మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ హీరో మమ్ముట్టి, ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌లు ఈ వేడుకలో 'పద్మభూషణ్' పురస్కారాలను స్వయంగా అందుకున్నారు. కళారంగానికి వారు చేసిన అసమాన సేవలకు గాను ఈ గౌరవం లభించింది. అలాగే సంగీత ప్రపంచంలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న వయొలిన్ విద్వాంసురాలు ఎన్. రాజం కూడా పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్. మాధవన్‌లకు ఈ ఏడాది కేంద్రం 'పద్మశ్రీ' పురస్కారాలను ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు ఈ దఫా వేడుకకు హాజరుకాలేకపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి క్లాసికల్ డ్యాన్సర్ దీపికారెడ్డి, దివంగత గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కుమారుడు అనిల్ కుమార్ అందుకున్నారు) తదితరులు పద్మశ్రీ అవార్డులను స్వీకరించిన వారిలో ఉన్నారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవ విశేషాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా రంగం నుంచి ఎంతోమంది అర్హులైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈసారి తగిన గుర్తింపు లభించిందంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మమ్ముట్టి, ధర్మేంద్ర వంటి నటుల పేర్లు ఈ జాబితాలో ఉండటంపై నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు కురిపిస్తున్నారు.

మొత్తంగా ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించగా.. తొలి విడతలో భాగంగా 66 మంది విజేతలకు రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేశారు. మిగిలిన విజేతలకు తదుపరి విడతలో అవార్డులను బహూకరించనున్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.