![]() |
![]() |
సినిమా పేరు: ముంబైకర్
నటీనటులు: విజయ్ సేతుపతి, విక్రాంత్ మాన్సే, తాన్యా మానిక్తాలా, హృదు హరూన్
రచయిత: లోకేష్ కనగరాజ్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
ఎడిటింగ్: దిలీప్ దామోదర్
సంగీతం: సలీల్ అమృతే
దర్శకత్వం: సంతోష్ శివన్
నిర్మాత: శిబు థమీన్స్
బ్యానర్: హెచ్ఆర్ పిక్చర్స్, జియో సినిమా
ఓటీటీ వేదిక: జియో సినిమా
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'మా నగరం'. ఇందులో సందీప్ కిషన్ నటించాడు. ఈ సూపర్ హిట్ తమిళ్ ఫిల్మ్ ని తెలుగులోనూ 'నగరం' పేరుతో విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఇదే కథని 'ముంబైకర్' గా హిందీలో రీమేక్ చేసారు. దానికి తెలుగు డబ్ వెర్షన్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. మరి ఈ కథ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం...
కథ:
ముంబై మహానగరం.. ఇక్కడ మనుషుల జీవితాలు ఆగకుండా పరుగెడుతూనే ఉంటాయి. అలాంటి మహానగరంలో ఒక టాక్సీ డ్రైవర్(సంజయ్ మిశ్రా), ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి ఉద్యోగం చేయడానికి రావడం, మరొకతను పెద్ద గ్యాంగ్ స్టర్(మున్ను) కావడమే లక్ష్యంగా శ్రమించడం.. ఇలా ఒక్కొక్కరి జీవితాలు ఒక్కో పాఠాన్ని చెప్తాయి. మున్నుగా విజయ్ సేతపతి ఒక డాన్ అవ్వాలని కలలు కంటుంటాడు. అలాంటి ఈ ముగ్గరి జీవితాలను 'ముంబైకర్' ఎలా మార్చింది. వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నారో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ముంబైకర్ ఒక నగరంలోని విభిన్న రకాల మనుషుల కథ.. వారి జీవిత ప్రయాణంలో కొన్ని రోజులు ఎలా గడిచాయో తెలిపే కథ.. అయితే కొన్ని సినిమాలు కంటెంట్ బాగుండి కథానాయకుడు బాగోలేక హిట్ కావు.. మరికొన్ని మంచి నటీనటులు ఉండి కథ బాగోలేక హిట్ కావు.. అలాగే కొన్ని సినిమాలు కథానాయకులు, కథ బాగున్నా హిట్ కావు. అలాంటి వాటిల్లో 'ముంబైకర్' ఒకటి. లోకేష్ కనగరాజ్ తమిళంలో తీసిన 'మా నగరం' బాగుంటుంది. అయితే దీనినే ఇప్పుడు హిందీలో 'ముంబైకర్' గా తీసారు. అయితే దీనిలో కొన్ని మార్పులు చేసారు ఈ మూవీ మేకర్స్. అయితే సినిమా చూసాక తెలిసింది ఏంటంటే ఎందుకు ఇలా తీసాడా అని అనిపిస్తుంది. మరి కొత్తగా తీయాలనుకుంటే సంతోష్ శివన్ పాత కథనే ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు.
సినిమా ప్రథమార్ధంలో ఉన్నంత స్లో సీన్స్ మరెక్కడా ఉండవు. సినిమా కథని డైవర్ట్ చేసి సహజమైన కథని ఇలా అడ్డదిడ్డంగా తీసాడేంటా అనిపించింది. మనం నగరం మూవీ చూస్తున్నంతసేపు ఆ పాత్రలలో లీనమై చివరిదాకా అలా చూస్తూ ఉండిపోతాం. క్యారెక్టర్ల పేర్లు కూడా తెలియకుండా ఒక నగరంలో ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటారో చక్కగా తీర్చిదిద్దిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ముంబైకర్ మాత్రం పాత్రలను గుర్తుపెట్టుకోవడంలోనే సగం కన్ఫూజన్.. ఎవరేంటో? ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
సినిమాలో ఏదైనా బాగుందంటే అది క్లైమాక్స్. ఇప్పటివరకు తమిళ్, తెలుగులో ఒక్కసారి కూడా చూడనివారు ఈ సినిమా క్లైమాక్స్ కి కనెక్ట్ అవుతారు. ఇప్పటికే చూసినవాళ్ళకి ఇది చాలా మామూలుగా ఉందే అనిపిస్తుంది. కథని ల్యాగ్ చేయకుండా ముందుకు తీసుకెళ్తే బాగుండేది. సంతోష్ శివన్ డైరెక్షన్ తేలిపోయింది. స్క్రీన్ ప్లే అంతగా సెట్ కాలేదు. క్యారెక్టర్స్ ని మలిచిన తీరు పెద్దగా హిట్ అవలేదు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ అసలు మ్యాచ్ అవ్వలేదు. ఆ తెలుగు డబ్బింగ్ వింటుంటే అసలు మనం ఈ సినిమానే చూస్తున్నామా లేదంటే వేరే సినిమాలోని పాత్రలు ఇందులోకి వచ్చాయా అన్నట్టుగా ఉంటుంది. ఒరిజినల్ కథని ఏదో చేద్దామని దాన్ని మార్చి సంతోష్ శివన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ప్రేక్షకుడితో ఈ సినిమాలోని ఏ క్యారెక్టర్ అంతగా కనెక్ట్ అవ్వదు. విజయ్ సేతుపతి హిందీలో చేసిన మొదటి సినిమా ఇది. కానీ అతనిని పూర్తి స్థాయిలో వాడుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ చూసిన వారు... ఇందులో విజయ్ సేతుపతి ఉన్నాడా అనే డౌట్ వస్తుంది.
సినిమాటోగ్రఫీ మాములుగా ఉంది. ఏదో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ ని చూసిన ఫీల్ కలుగుతుంది. దిలీప్ దామోదర్ ఎడిటింగ్ పర్వాలేదు. కానీ ప్రథమార్ధంలో కొన్ని సీన్లని ట్రిమ్ చేస్తే బాగుండు. సలీల్ అమృతే సంగీతం ఉందా లేదా అన్నట్లుగా ఉంది. అసలు బిజిఎమ్ ఎక్కడ ఉందా అని వెతుక్కునేలా ఉంది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లలోని బిజిఎమ్ లని అక్కడ అక్కడ కాపీ చేసేసారనిపించింది. నిర్మాణ విలువలు అంతగా బాలేవు.
నటీనటుల పనితీరు:
మున్నుగా విజయ్ సేతుపతి ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఇషితగా తాన్య మానిక్తలా అందంతో ఆకట్టుకుంది. ఆదిల్ గా హృదు హరూన్ బాగా చేసాడు. టాక్సీ డ్రైవర్ గా సంజయ్ మిశ్రా, ప్రబల్ కాంత్ పాటిల్ గా రణవీర్ షోరే, పోలీస్ అధికారిగా సచిన్ ఖేడేకర్ ఇలా అందరూ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
తెలుగువన్ పర్స్పెక్టివ్:
తెలుగులో రిలీజ్ అయిన నగరం సినిమాని చూసిన వాళ్ళు ఈ సినిమాని చూడకపోవడమే బెటర్. ఇందులోని నటీనటుల కోసం యాక్టింగ్ కోసం ఒక్కసారి చూడొచ్చు.
రేటింగ్: 1.75/5
-దాసరి మల్లేశ్
![]() |
![]() |