కొంతకాలంగా ఫ్రాంచైజ్ సినిమాల హవా నడుస్తోంది. ఇప్పుడు ఆ లిస్టులోకి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేరిపోయారు. అయితే మెజారిటీ దర్శకులు స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ తో ఫ్రాంచైజ్ సినిమాలు చేస్తుంటే.. శ్రీకాంత్ అడ్డాల మాత్రం కొత్త హీరోతో ఫ్రాంచైజ్ సినిమాకి శ్రీకారం చుట్టారు.
ఇటీవల 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4 గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. ఈరోజు ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'పెద కాపు' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. 'ఓ సామాన్యుడి సంతకం' అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో సామాన్యుల మధ్యలో నుంచి వచ్చిన అసామాన్యుడిలా హీరో కనిపిస్తున్నాడు.
ఇది ఫ్రాంచైజ్ సినిమా. అందుకే మొదటిభాగం అని తెలిపేలా 'పెద కాపు-1' అని టైటిల్ ని ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా ప్రకటన సందర్భంగా పోస్టర్ లో #PK1 అని రాసుండటం చూసి, హీరో పేరు పీకే అక్షరాలతో ఉంటుందేమో, అతని మొదటి సినిమా కాబట్టి అలా వర్కింగ్ టైటిల్ పెట్టరేమో అని భావించారంతా. తాజాగా 'పెద కాపు-1' అని టైటిల్ ప్రకటనతో ఇది ఫ్రాంచైజ్ ఫిల్మ్ అని క్లారిటీ వచ్చేసింది. మరి ఈ ఫ్రాంచైజ్ నుంచి ఎన్ని భాగాలు వస్తాయో చూడాలి.