English | Telugu

'అహింస' మూవీ రివ్యూ

 

సినిమా పేరు: అహింస
తారాగణం: అభిరామ్, గీతిక తివారి, సదా, రజత్ బేడి, మనోజ్ టైగర్, కమల్ కామరాజు, దేవీప్రసాద్, కల్పలత, రవి కాలే, బిందు చంద్రమౌళి, రమణ్‌దీప్ కౌర్, అనంత్, అంబటి శ్రీనివాస్, నితిన్ ప్రసన్న, సమీర్ గోస్వామి, ఫన్‌బకెట్ భరత్, హరశ్రీనివాస్, రాజేశ్ ఉల్లి, షైనింగ్ ఫణి
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
సాహిత్యం: చంద్రబోస్
మ్యూజిక్: ఆర్పీ పట్నాయక్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు 
ఆర్ట్: సుప్రియ
ఫైట్స్: బి.వి. రమణ, రియల్ సతీశ్
నిర్మాత: పి. కిరణ్
కథ, చిత్రానువాదం, పోరాటాలు, దర్శకత్వం: తేజ
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ: 2 జూన్ 2023

నిర్మాత డి. సురేశ్‌బాబు చిన్న కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ తేజ 'అహింస' అనే సినిమాని రూపొందిస్తున్నారనే సమాచారం బయటకు వచ్చినప్పుడు ఇండస్ట్రీ జనాలతో పాటు సగటు సినీప్రియులు కూడా కుతూహలంగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇదివరకే తేజ తన సినిమాలతో అనేకమంది నటీనటుల్ని పరిచయం చేయడం, వారిలో ఎక్కువమంది తర్వాత కాలంలో పాపులర్ కావడం మనకు తెలుసు. అభిరామ్ సైతం ఆ లిస్టులో చేరతాడా, అసలు అతను ఎలా నటించాడనే ప్రశ్నలకు 'అహింస' ద్వారా సమాధానం లభించిందా?

కథ
కాతేరు అనే పల్లెటూళ్లో చిన్నతనంలోనే అమ్మానాన్నల్ని పోగొట్టుకుని మేనమామ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంటాడు రఘు (అభిరామ్). మరదలు అహల్య (గీతిక) అంటే అతనికి ప్రాణం. రఘు ఫక్తు అహింసావాది. ఈ విషయంలో బావా మరదళ్ల మధ్య వాదనలు కూడా జరుగుతుంటాయి. ఒకరోజు ధనలక్ష్మీ దుష్యంతరావు (రజత్ బేడి) అనే సంపన్నుడి ఇద్దరు కొడుకులు కామంతో కళ్లు మూసుకుపోయి అహల్యపై అత్యాచారం చేస్తారు. ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అహల్యను హాస్పిటల్‌లో చేర్చి న్యాయపోరాటం చేస్తాడు రఘు. అతనికి లక్ష్మి (సదా) అనే లాయర్ అండగా నిలుస్తుంది. పోలీసుల కస్టడీలో ఉన్న కొడుకుల్ని నిర్దోషులుగా బయటకు తీసుకురావడానికి బ్రోకర్ చటర్జీ (మనోజ్ టైగర్) సాయం తీసుకుంటాడు దుష్యంతరావు. ఆ తర్వాత ఏం జరిగింది? చీమకు కూడా హాని తలపెట్టని రఘు.. దుర్మార్గులతో ఎలా తలపడ్డాడు? అహల్యకు న్యాయం జరిగి, మామూలు మనిషయ్యిందా లేదా? అహల్య-రఘు ఒక్కటయ్యారా?.. ఇలాంటి ప్రశ్నలకు మిగతా సినిమాలో జవాబులు లభిస్తాయి.

విశ్లేషణ
లైంగిక దాడికి గురైన మరదల్ని కాపాడుకోవడానికి కథానాయకుడు అహింసా మార్గంలో నానా అగచాట్లు పడుతూ, ఆమె ప్రాణాలకు విలన్ల నుంచి ప్రాణాపాయం ఏర్పడితే, హింసా మార్గంలోకి వచ్చి, హత్యలు చేయడం, మరదల్ని తీసుకొని అడవుల్లోకి వెళ్లడం, అక్కడ విచిత్రంగా కనిపించే డ్రగ్ స్మగ్లర్స్ పాలపడటం, ఎవర్నీ సరిగా కొట్టడమే రాని హీరో గాల్లో రకరకాల విన్యాసాలు చేస్తూ దుండగుల్ని నరికేయడం, ఈ మధ్యలో హీరో హీరోయిన్లు ఓ పాట పాడటం, విలన్లు ఓ ఐటం గాళ్‌ను తెచ్చి ఆడిపాడించడం.. ఇదంతా ఎప్పటి సినిమాల ధోరణి?! 'జయం', 'నువ్వు నేను' సినిమాలు వచ్చిన కాలం ధోరణి కదూ! అంటే ఆ కాలంలోనే తేజ ఇంకా ఉండిపోయాడు అన్నమాట. 

ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీసాఫీసర్ (రవి కాలే) కేస్ ఫైల్‌ను చదువుతుండగా కథ నడుస్తున్నట్లు చూపించాడు దర్శకుడు. భోజ్‌పురి నటుడు మనోజ్ టైగర్ చేసిన బ్రోకర్ చటర్జీ క్యారెక్టర్ కుంటుకుంటూ నడుస్తూనే ఎంతదూరమైనా.. అదీ పరిగెత్తుకుంటూ పోయే హీరోతో సమానంగా సునాయాసంగా పోతుంటే.. అతని స్టామినాకి మనం ఆశ్చర్యపోక మానం. కోర్టు సీన్లు అయితే ఎంతటి ప్రహసనంగా ఉంటాయో వర్ణించడానికి మాటలు చాలవు. ఇద్దరు కుర్రాళ్లు మేజర్లో, కాదో స్కూల్ సర్టిఫికెట్లు చూస్తే సరిపోతుంది కదా అని మనకు అనిపిస్తుంది కానీ, ఈ సినిమాలోని జడ్జికి కానీ, లాయర్లకు కానీ, ఫిర్యాదుదారునికి కానీ తట్టదు! 

విలన్ దుష్యంతరావు రెండు పాత్రల్ని ఒక పొడవాటి కత్తితో బహిరంగంగా పొడిచి పారేసినప్పుడు పరిసరాలన్నీ నిర్జనంగా ఎందుకు ఉంటాయో తెలీదు! పట్టపగలు అక్కడి బస్తీలో ఒక్క మనిషి ఆనవాలు కనిపించదు! అడవుల్లో స్మగ్లింగ్ గ్యాంగ్ కనిపించే తీరు, వాళ్ల ప్రవర్తన చూస్తే వాళ్లు ఏనాటి కాలం వాళ్లో అనిపిస్తే.. అది మన తప్పుకాదు. ఈ సినిమాలో సెల్‌ఫోన్లు కనిపిస్తాయి. అయితే రెండు మూడు సందర్భాల్లో మినహా, వాటి జోలికి ఏ పాత్రలూ వెళ్లకపోవడం ఇంకో విచిత్రం. టైటిల్ కార్డులో ఫైట్‌మాస్టర్స్ రియల్ సతీశ్, బి.వి. రమణతో పాటు డైరెక్టర్ తేజ కూడా ఫైట్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఏ ఫైట్స్‌ను డిజైన్ చేశారో తెలీదు. క్లైమాక్స్‌లో ఆకులు అలములు చుట్టుకొని హీరో ఫైట్ చేస్తాడు. అప్పుడు అతని ముఖం మనకు కనిపించదు. డూప్‌తోటే ఆ ఫైట్‌ను లాగించారేమోనని మనకు సందేహం రాకమానదు. దుప్పటి ముసుగుతన్ని పడుకొని ఉండే ఒక ఎత్తుపళ్ల స్త్రీ, ఆ దుప్పటి లాగగానే ఎదుట ఉన్న వ్యక్తి నోట్లో నోరు పెట్టడం ఏ కాలపు చవకబారు హాస్య సన్నివేశం! అలాంటి ముతక హాస్యాన్ని తేజ ఇంకా నమ్ముకోవడం ఎంతటి ఆశ్చర్యకరం!

కథా కథనాలను పక్కనపెడితే టెక్నికల్‌గా 'అహింస' మెరుగ్గానే ఉంది. సమీర్ రెడ్డి చాయాగ్రహణ ప్రతిభకు ఈ సినిమా ఇంకో చక్కని ఉదాహరణ. హీరో క్లోజప్ షాట్స్ సాధ్యమైనంతవరకు లేకుండా జాగ్రత్తపడ్డాడు. మిగతా లొకేషన్లలో కంటే అడవుల్లో తీసిన షాట్స్ మరింత బాగా వచ్చాయి. ఆర్పీ పట్నాయక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఉన్నత స్థాయిలోనే ఉంది. ఈ సినిమాకు ఎంత మంచి పాటలైనా వృథాయే. సీనియర్ మోస్ట్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు 'అహింస'ను జనరంజకంగా చూపించాలని ఎంత శ్రమించినా ఫలితం లేకుండాపోయింది. సన్నివేశాలు ఆ తీరున ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? సుప్రియ ఆర్ట్ వర్క్ బాగానే ఉంది. అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ కొన్నిచోట్ల సందర్భానుసారంగా, అనేకచోట్ల ఫార్సుగా తోచాయి. 

నటీనటుల పనితీరు
హీరోగా అభిరామ్ ను 'అహింస' ద్వారా జనం మీద రుద్దడానికి చేసిన ప్రయత్నం గట్టిగా బెడిసికొట్టింది. అతని హావభావాల ప్రదర్శన హారిబుల్. అతను చెప్పే డైలాగులకూ, అతని ఎక్స్‌ప్రెషన్స్‌కూ చాలాచోట్ల సంబంధం కనిపించలేదు. కొన్ని చోట్ల అతను డైలాగ్ చెప్తుంటే, అతని ముఖాన్ని కాకుండా ఎదుటి పాత్రల ముఖాల్ని చూపించడం వల్ల కొంతైనా బతికిపోయాం. అతని రూపం, వాచకం, శరీర భాష.. ఏవీ హీరో మెటీరియల్ కాదని ఇప్పటికైతే స్పష్టంగా చెప్పేశాయి. భవిష్యత్తులో అతను హీరోగా రాణించాలంటే, చాలా చాలా కష్టపడాలి, సాధన చెయ్యాలి. హీరోయిన్ అహల్య పాత్రలో గీతిక తివారి ఫర్వాలేదు. అయితే ఆమెను చూస్తే.. ఒక పల్లెటూరి అమ్మాయి నడుము, వక్షస్థలం కనిపించేట్లు లంగా వోణీ ధరిస్తుందనే అభిప్రాయం కలిగించేట్లు ఆమె డ్రస్సింగ్ ఉంది.

దుష్యంతరావు పాత్రలో రజత్ బేడి బాగానే చేశాడు కానీ, అతని క్యారెక్టరైజేషన్ ఆకట్టుకొనే రీతిలో లేదు. అతని భార్యగా ముంబై నటి రమణ్‌దీప్ కౌర్ కూడా విలనీని ప్రదర్శించింది. బ్రోకర్ చటర్జీ పాత్రలో భోజ్‌పురి యాక్టర్ మనోజ్ టైగర్ బాగా నటించాడు కానీ, కొన్నిసార్లు అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. లాయర్ లక్ష్మి క్యారెక్టర్‌లో సదా రాణించింది. ఆమె పాత్రను ముగించిన తీరే సరిగా లేదు. అవినీతిపరుడైన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా కమల్ కామరాజు, కూతురు కంటే డబ్బే ప్రధానమనుకొనే తండ్రి పాత్రలో దేవీప్రసాద్, కూతురికి న్యాయం జరగాలని తపించే తల్లి పాత్రలో కల్పలత, పోలీస్ ఆఫీసర్‌గా రవి కాలే, విలన్ పక్షపు లాయర్‌గా బిందు చంద్రమౌళి పాత్రల పరిధి మేరకు నటించారు. ఫన్‌బకెట్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన హరశ్రీనివాస్, షైనింగ్ ఫణి, భరత్, రాజేశ్ ఉల్లి లకు చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ లభించింది.

తెలుగువన్ పర్‌స్పెటివ్
హావభావ ప్రదర్శనలో కానీ, డైలాగ్ డిక్షన్ పరంగా కానీ, బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ.. ఏ రకంగా చూసినా హీరో మెటీరియల్ అనిపించని దగ్గుబాటి అభిరామ్ ను మనమీద బలవంతంగా రుద్దడానికి చేసిన ప్రయత్నం వికటించింది. రెండు దశాబ్దాల క్రితం రాజ్యం చేసిన తరహా కథా కథనాలతో దర్శకుడు తేజ రూపొందించిన 'అహింస'ను చివరిదాకా చూడాల్సి రావడం అతిభయంకర హింస!

రేటింగ్: 1.5/5

- బుద్ధి యజ్ఞమూర్తి