![]() |
![]() |

టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. పలువురి హీరోల సినిమాలు మళ్ళీ విడుదలై మంచి వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ రీరిలీజ్ ట్రెండ్ ని మరోస్థాయికి తీసుకెళ్ళబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'సింహాద్రి'ని కొత్త సినిమా తరహాలో భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. దీనిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భాగం కావడం విశేషం.
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న సింహాద్రి సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. కనివిని ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు బిగ్ స్క్రీన్ పై 4Kలో సింగమలై మాస్ మేనియా చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సింహాద్రి రీరిలీజ్ పై నెలకొన్న క్రేజ్ ని మరోస్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమా విడుదలలో బడా బడా చేతులు భాగస్వామ్యం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని నైజాంలో, వైజాగ్ లో దిల్ రాజు విడుదల చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు చేయి పడిందంటే ఈ చిత్రం భారీస్థాయిలో రీరిలీజ్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

ఇక ఓవర్సీస్ లో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తుండటం మరో విశేషం. అలాగే ఈస్ట్ గోదావరిలో విజయ లక్ష్మి సినిమాస్, వెస్ట్ గోదావరిలో ఆదిత్య ఫిలిమ్స్, తమిళనాడులో ఎస్ఎస్సీ మూవీస్ విడుదల చేస్తున్నాయి. మే 10 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. అంతేకాకుండా మరే రీరిలీజ్ మూవీకి చేయని విధంగా లిరికల్ వీడియోలను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ రేంజ్ లో ఓ కొత్త సినిమాలాగా విడుదలవుతున్న సింహాద్రి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |