![]() |
![]() |

అక్కినేని నాగ చైతన్య ఈ నెల 12న 'కస్టడీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీతో చైతన్య హిట్ కొట్టడం ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరోవైపు దీని తర్వాత చైతన్య చేయబోయే సినిమాలు ఏంటనే దానిపైనా ఆసక్తి నెలకొంది. చైతన్య గతంతో తాను పని చేసిన దర్శకులతోనే మళ్ళీ పని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
చైతన్య తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లో చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి గతేడాది 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న చందు మొండేటి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. చైతన్య-చందు మొండేటి కలిసి పని చేయడం ఇది మూడోసారి. వారి కలయికలో మొదట 'ప్రేమమ్' సినిమా వచ్చింది. మలయాళ ప్రేమమ్ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే వీరి కలయికలో వచ్చిన రెండో సినిమా 'సవ్యసాచి' మాత్రం నిరాశపరిచింది. మరి ఈసారి ఈ ఇద్దరూ ఎలాంటి సినిమా చేయనున్నారో చూడాలి. మరోవైపు గీతా ఆర్ట్స్ లో చైతన్యకు ఇది రెండో సినిమా. గతంలో గీతా ఆర్ట్స్ లో చైతన్య హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన '100% లవ్' సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక తనకు 'మజిలీ' వంటి ఘన విజయాన్ని అందించిన శివ నిర్వాణతోనూ చైతన్య ఒక సినిమా చేయనున్నాడని వినికిడి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'ఖుషి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శివ.. దాని తర్వాత చైతన్య ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడని సమాచారం.
![]() |
![]() |