మాస్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన గోపీచంద్ మలినేనితో రవితేజ జట్టుకట్టిన `బలుపు` కూడా అచ్చంగా ఆ తరహా సినిమానే. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రవిగా, శంకర్ గా రెండు ఛాయలున్న పాత్రలో ఆకట్టుకున్నారు రవితేజ. శ్రుతిహాసన్, అంజలి కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అడివి శేష్, అశుతోష్ రాణా, అలీ, నాజర్, బ్రహ్మాజీ, రావు రమేశ్, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ఆదిత్యా మీనన్, జయప్రకాశ్ రెడ్డి, అజయ్, షఫి, సత్యం రాజేశ్, సుప్రీత్, ప్రభాస్ శ్రీను, ఏవీయస్, సురేఖా వాణి, అర్చన ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. రాయ్ లక్ష్మీ ఓ ప్రత్యేక గీతంలో తన గ్లామర్ తో కనువిందు చేసింది.
యువ సంగీత దర్శకుడు తమన్ బాణీలకు అనుగుణంగా `సిరివెన్నెల` సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, అనంత శ్రీరామ్ సాహిత్యమందించారు. ``నిను చూసిన క్షణంలో`` (ఏమైందో), ``కాజల్ చెల్లివా``, ``పడిపోయానిలా``, ``పాతికేళ్ళ చిన్నది``, ``లక్కీ లక్కీ రాయ్`.. ఇలా ఇందులోని పాటలన్నీ రంజింపజేశాయి. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వర పొట్లూరి నిర్మించిన `బలుపు`.. 2013 జూన్ 28న విడుదలై విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 9 వసంతాలను పూర్తిచేసుకుంది.