కోలీవుడ్ హీరో కార్తీ 'ఆవారా', 'యుగానికొక్కడు', 'ఖాకి', 'ఖైదీ' వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది 'సుల్తాన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కార్తీ ఈ ఏడాది మూడు వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆగష్టు 31న 'విరుమాన్', సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్:1' సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ టాలెంటెడ్ హీరో.. అక్టోబర్ లో 'సర్దార్' సినిమాతో అలరించనున్నాడు.
'అభిమన్యుడు' ఫేమ్ పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందుతోన్న సినిమా 'సర్దార్'. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది. ఎప్పుడూ లేనిది ఓ డబ్బింగ్ సినిమా హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'ని హీరో నితిన్ కి చెందిన శ్రేష్ఠ్ మూవీస్ తెలుగులో విడుదల చేసి భారీ లాభాలను చూసింది. అదే బాటలో ఇప్పుడు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ సంస్థ వెళ్తోంది. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది, పైగా ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే 'సర్దార్' తెలుగు రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న 'సర్దార్'ను తెలుగులో భారీస్థాయిలో విడుదల చేసేందుకు అన్నపూర్ణ సన్నాహాలు చేస్తోందట.