![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 1986 సంవత్సరానికి ప్రత్యేక స్థానం ఉంది. మొత్తం 7 చిత్రాలతో ఆ ఏడాది బాలయ్య సందడి చేయగా.. వాటిలో ఆరు వరుస చిత్రాలు విజయపథంలో పయనించాయి. బాలకృష్ణని `డబుల్ హ్యాట్రిక్ స్టార్` చేశాయి. అలా.. సక్సెస్ రూట్ లో వెళ్ళిన సినిమాల్లో `దేశోద్ధారకుడు` ఒకటి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్. ఎస్. రవిచంద్ర డైరెక్ట్ చేయగా.. బాలయ్యకి జంటగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అలరించారు. రావుగోపాలరావు, సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్, కాంతారావు, సుధాకర్, మల్లికార్జునరావు, ముచ్చర్ల అరుణ, సుత్తి వీరభద్రరావు, సంయుక్త, కల్పనా రాయ్, వై. విజయ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీతమందించిన ఈ సినిమాకి దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. మధురగాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి. సుశీల పాటలన్నింటికి గాత్రమందించారు. మొత్తం ఐదు పాటలున్న ఈ ఆల్బమ్ లో ``వచ్చే వచ్చే వానజల్లు``, ``గగన వీధుల్లో`` చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. విజయభాస్కర్ ఫిలిమ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. మురళీ మోహన రావు నిర్మించిన `దేశోద్ధారకుడు`.. 1986 ఆగస్టు 7న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ సినిమా 35 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |