బీచ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తెలుగు దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముందు వరుసలో ఉంటారు. `ఇడియట్`, `శివమణి`, `సూపర్`, `పోకిరి`, `దేశముదురు`, `చిరుత`, `నేనింతే`, `గోలీమార్`, `బిజినెస్ మేన్`, `టెంపర్`, `ఇస్మార్ట్ శంకర్`.. ఇలా తను రూపొందించిన పలు చిత్రాల్లో `బీచ్` నేపథ్యంలో సాగే రొమాంటిక్ సాంగ్స్ కి చోటిచ్చారు పూరి. ఆ పాటలన్నీ కూడా సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కుర్రకారుకి కికెక్కించాయి.
ఈ నేపథ్యంలోనే.. తన తాజా చిత్రం `లైగర్`కీ `బీచ్` టచ్ ఇవ్వబోతున్నారట `బద్రి` కెప్టెన్. కథానుసారం.. చిత్ర నాయకానాయికలు విజయ్ దేవరకొండ, అనన్యా పాండేపై ఈ ప్రణయగీతాన్ని చిత్రీకరించేందుకు పూరి ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు.. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ తగ్గాక ఈ పాటని షూట్ చేయబోతున్నారట. మరి.. ఈ బీచ్ సాంగ్ సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కుతున్న `లైగర్`లో సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. కాగా, సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పూరి అండ్ టీమ్ ప్లాన్ చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ తేది మారే అవకాశం లేకపోలేదు.