అల్లరి నరేష్ నటించిన 'నాంది' సినిమాతో దర్శకుడిగా పరిచయమై విజయాన్ని అందుకున్న 'విజయ్ కనకమేడల' తన మంచి మనసుని చాటుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై కూడా పడింది. ఎందరో కరోనా బారిన పడగా కొందరు కరోనా కాటుకు బలయ్యారు. పలువురు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న దర్శకుల కుటుంబాలకు సహాయం చేసేందుకు విజయ్ ఒక మంచి పనికి నాంది పలికారు.
"మిత్రులందరికీ నమస్కారం.. మన దర్శకుల సంఘం సభ్యులు కూనంశెట్టి వెంకటేశ్వరరావు గారు, శ్రావణ్ గారు, 'శ్రీకారం' సినిమా కోడైరెక్టర్ రాజా గారు, 'మా అబ్బాయి' సినిమా డైరెక్టర్ కుమార్ గారు కరోనా వల్ల రీసెంట్ గా మరణించిన సంగతి తెలిసిందే. ఈ టైంలో వారి కుటుంబాలకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను నా వంతుగా ఒక్కొక్క కుటుంబానికి రూ.25,000 చొప్పున లక్ష రూపాయలు వారం క్రితమే ట్రాన్స్ ఫర్ చేయడం జరిగింది. ఇది తెలిసి మిత్రులు కృతజ్ఞతలు చెప్పి.. ప్రస్తుతం కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల సఫర్ అవుతున్న మన దర్శకుల సంఘ సభ్యుల ఫ్యామిలీలు చాలా ఉన్నాయి వీలైతే వారికి ( మినిమమ్ గ్రో సరీస్, మెడికేషన్స్, మెయింటనెన్స్ కి ) కూడా ఎంతో కొంత సహాయం చేయండి అంటూ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాలేము కానీ ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశం వుంది. మనకు చేతనైన సహాయం చేసి ఒక మంచి పనికి 'నాంది' పలుకుదాం. అందుకు నేను మిమ్మల్నీ అడుగుతున్నాను, నా తరపున మీ తరఫున మన అందరి తరపున అత్యవసరమైన వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రండి. నా సోషల్ మీడియా మిత్రులు మీరు దయచేసి మీకు తోచినంత సహాయం చేయండి. చాలామంది జీవితాలని నిలబెట్టిన వాళ్ళం అవుతాము." అంటూ విజయ్ కనకమేడల సోషల్ మీడియా వేదికగా కోరారు.
సోషల్ మీడియాలో విజయ్ కనకమేడల పెట్టిన పోస్ట్ కి విశేష స్పందన లభిస్తుంది. అనేకమంది విజయ్ ని అభినందిస్తూ వారికి తోచిన సాయాన్ని చేస్తున్నారు. నాంది డైరెక్టర్ మంచి పనికి నాంది పలికారంటూ ప్రశంసిస్తున్నారు.