విజయవాడలో పుట్టిన కాంచన మద్రాసులో పెరిగారు. ఆమె తండ్రి రామకృష్ణశాస్త్రి పేరుపొందిన ఇంజనీర్. చిన్నప్పట్నించీ కాంచనకు సంగీతమంటే ఇష్టం. రేడియోలో వచ్చే పాటల్ని శ్రద్ధగా వింటూ ఆ గాయకుల గొంతులతో పాటు తన గొంతూ కలిపి పాడుతూ ఆనందిస్తుండేవారు. పాటకు తగ్గట్లు గంతులు కూడా వేస్తుండేవారు. కూతుర్లోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు తొమ్మిదో యేట నుంచే నాట్యంలో శిక్షణనిప్పించారు. వడయూర్ రామయ్య పిళ్లే వద్ద నృత్యంలో వివిధ రీతుల్ని వంటపట్టించుకున్నారు.
హైస్కూల్ అయ్యాక ఇంటర్మీడియెట్ కోసం యతిరాజ్ కాలేజీలో చేరారు కాంచన. ఆ కాలంలో చాలా నాటకాల్లో వేషాలు వేసి తరచూ బహుమతులందుకొంటూ ఉండేవారు. ఇంటర్మీడియెట్ అయ్యాక చదువు మానేశారు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఉబుసుపోక పేపర్లో కనిపించిన ఓ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలో ఎంపికై ఎయిర్ హోస్టెస్‌గా మారారు. రెండేళ్లు సరదాగా గడిచిన తర్వాత ఆ ఉద్యోగం ఆమెకు విసుగు పుట్టించింది. అయినా అందులోనే కాలం నెట్టుకొస్తున్న సందర్భంలో తమిళ నిర్మాత కోవై చెళియన్ విమాన ప్రయాణంలో ఆమెను చూసి, తన మిత్రుడైన డైరెక్టర్ శ్రీధర్‌కు ఆమె గురించి చెప్పారు.
అప్పట్లో శ్రీధర్ 'కాదలిక్క నేరమిల్లై' చిత్రాన్ని రంగుల్లో తియ్యాలని కొత్త తారల కోసం అన్వేషిస్తున్నారు. అలా కాంచనను శ్రీధర్‌కు పరిచయం చేశారు కోవై చెళియన్. కాంచన మొహంలో కనిపించిన సజీవ హావభావాలు శ్రీధర్‌కు బాగా నచ్చాయి. అందుకే తన సినిమాలో ఆమెను కథానాయికగా తీసుకున్నారు. వెంటనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సినీ రంగంలో అడుగుపెట్టారు కాంచన. 'కాదలిక్క నేరమిల్లై' విడుదలైంది. తమిళనాట ఆ సినిమా రికార్డ్ కలెక్షన్లను సాధించింది. ఒకే ఒక్క సినిమాతో కాంచన పేరు మారుమోగింది. పలువురు నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడ్డారామె.
రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ వాళ్ల 'వీరాభిమన్యు' చిత్రంతో తెలుగువాళ్ల అభిమాన నటి అయ్యారు కాంచన. ఆ తర్వాత వచ్చిన అన్నపూర్ణా పిక్చర్స్ వారి 'ఆత్మగౌరవం', పద్మశ్రీ వారి 'ప్రేమించి చూడు' మొదలుకొని 'నేనంటే నేనే', 'తల్లి ప్రేమ', 'భలే మాస్టారు' వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో రాణించారు. తెలుగులో బిజీ తారగా మారారు. తమిళంలోనూ ఆమెకు మంచి గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో హిందీలో 'ఫర్జ్' సినిమా చేశారు. అన్నట్లు కాంచన అసలు పేరు వసుంధర. కాలేజీ చదువు ముగియగానే 'భట్టి విక్రమార్క'లో కాళికాదేవిగా నటించారు. కానీ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఎయిర్ హోస్టెస్‌గా మారారు. తిరిగి శ్రీధర్ పుణ్యమా అని చిత్రసీమలో నిలబడ్డారు.