దేశంలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా ఫిలిమ్స్‌లో 'ఆదిపురుష్' ఒకటి. ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రధారులు. లేటెస్ట్గా ఈ స్టార్క్యాస్ట్లోకి కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఎంటర్ అవుతున్నాడని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణం గాథ ఆధారంగా 'ఆదిపురుష్' రూపొందుతోంది. శ్రీరామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మణునిగా సన్నీ సింగ్, రావణాసురునిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పుడు రావణుని తమ్ముడు విభీషణుని పాత్రకు సుదీప్‌ను సంప్రదించారనేది ప్రచారంలో ఉన్న అంశం.
ఈ ప్రచారానికి సుదీప్ రియాక్టయ్యాడు. "ఆదిపురుష్ టీమ్ నా మేనేజర్‌ను సంప్రదించిన మాట నిజం. అయితే వ్యక్తిగతంగా నేనెవర్నీ ఇంతదాకా కలవలేదు. డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీనిపై మాట్లాడటం తొందరపాటవుతుంది." అని చెప్పాడు. వినిపిస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించనూ లేదు, అలాగని ధ్రువీకరించనూ లేదు. విభీషణుని క్యారెక్టర్‌ను కనుక సుదీప్ ఒప్పుకుంటే సినిమాకి మరింత ఆకర్షణ రావడమే కాకుండా, హైప్ ఇంకా పెరుగుతుందనేది నిజం.
ఈలోగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాలు రకరకాలుగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. ముంబైలో షూటింగ్ జరిగితే బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉందనీ, హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తే, బడ్జెట్‌ను అదుపులో పెట్టవచ్చనీ డైరెక్టర్ ఓమ్ రౌత్‌కు చెప్పి కన్విన్స్ చేయడంలో ప్రభాస్ సక్సెస్ అయ్యాడు. ముంబైలో కొవిడ్ కేసులు తామర తంపరగా పెరుగుతుండటం వల్ల యూనిట్‌కు అది శ్రేయస్కరం కాదని ఓమ్ రౌత్ కూడా రియలైజ్ అయ్యాడు. రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ కోసం ఇప్పటికే కొత్త సెట్లను నిర్మిస్తున్నారు. మరో వారం రోజులకు ఈ సెట్స్ రెడీ అవుతాయనీ, షూటింగ్ మొదలవుతుందనీ ఆశిస్తున్నారు.