![]() |
![]() |

ఇవాళ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. ఇంకా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ డిమాండ్ నడుస్తోన్న మ్యూజిక్ డైరెక్టర్. స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ చాయిస్ అతడే! ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో అతడి క్రేజ్, డిమాండ్ అమాంతం పెరిగిపోయాయి. ఆ సినిమాలోని పాటలు యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించాయి.
అలాంటి తమన్ తొలి సంపాదన ఎంతో తెలుసా? అక్షరాలా.. 30 రూపాయలు! ఏ సినిమాకు అంత గొప్ప రెమ్యూనరేషన్ తీసుకున్నాడనుకుంటున్నారు? నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన జానపద చిత్రం 'భైరవ ద్వీపం'కు. ఆ సినిమా వచ్చింది 1994లో. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఆ సినిమాకు సంగీతం అందించింది మాధవపెద్ది సోదరులు (సురేశ్, రమేశ్) కదా.. అనే సందేహం రావచ్చు.
నిజమే. అయితే తమన్ ఆ సినిమాలోని ఒకే ఒక్క సీన్‌కు రీరికార్డింగ్ ఇచ్చాడు. ‘‘నేను బాలయ్యగారి ‘భైరవద్వీపం’ సినిమాలోని ఓ సన్నివేశానికి ఆర్‌ఆర్ ఇచ్చాను. అందుకుగాను నేను తీసుకున్న జీతం 30 రూపాయలు. నా తొలి సంపాదన ఆయన సినిమాతోనే స్టార్ట్ అయింది’’ అని స్వయంగా చెప్పాడు తమన్. అదీ విషయం.
![]() |
![]() |