![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మ నాలుగేళ్ల క్రితం 'వంగవీటి' అనే సినిమా డైరెక్ట్ చేశారు. వంగవీటి మోహనరంగా జీవితం ఆధారంగా ఆ సినిమాని ఆయన రూపొందించారు. ఆ సినిమా రిలీజ్‌కు ముందు ‘శివ టు వంగవీటి : ద జర్నీ ఆఫ్ ఆర్జీవీ’ అనే వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ వేడుకలో నాగార్జున, వెంకటేశ్, రాజమౌళి, పూరి జగన్నాథ్, తనికెళ్ల భరణి, బి. గోపాల్, గుణశేఖర్, వైవీయస్ చౌదరి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, హీరో రాజశేఖర్, ఎస్. గోపాల్‌రెడ్డి లాంటి మహామహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీని అందరూ తెగ పొగిడేశారు.
సాధారణంగా పొగడ్తలకు పొంగిపోని ఆర్జీవీ వారి మాటల తర్వాత మాట్లాడుతూ, ‘‘ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్లీ వస్తావు. మనిషివా? దెయ్యానివా? అని ట్విట్టర్‌లో కామెంట్ చేశాడొకడు. నాకా అర్హత ఉంది. నేనీ స్థాయికి వచ్చానంటే నాగార్జునే కారణం. ఇకపై నా సినిమాలన్నీ సూపర్‌హిట్స్ అవుతాయని చెప్పను. కానీ, గర్వంగా చెప్పుకునే సినిమాలు తీస్తానని రాజమౌళి, నాగార్జునలపై ఒట్టేస్తున్నా’’ అన్నారు.
మరి ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలు చూస్తుంటే ఆ ఒట్టు తీసి ఆయన గట్టు మీద పెట్టేశాడని భావించవచ్చు. లేదంటే ఇప్పుడు తాను తీస్తున్న సినిమాలు గర్వంగా చెప్పుకునేలా ఉన్నాయని ఆయన అంటే మనం చేసేదేముంది? వంగవీటి తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన లేదా ప్రొడ్యూస్ చేసిన సినిమాలు.. మేరే బేటీ సన్నీ లియోన్ బన్‌నా చాహ్‌తీ హై, గాడ్ సెక్స్ అండ్ ట్రూత్, ఆఫీసర్, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, క్లైమాక్స్, నేక్డ్, పవర్‌స్టార్, థ్రిల్లర్, డేంజరస్.. వీటిలో రాజమౌళి, నాగార్జున గర్వపడే సినిమాలు ఏవబ్బా?!
![]() |
![]() |