![]() |
![]() |

బిగ్ బాస్ 4లో సింగరేణి కుర్రోడు సయ్యద్ సొహేల్ యమ హుషారుగా హౌస్‌లో అల్లరి చేశాడు. టాస్క్‌లు చేయడంలో, గేమ్స్ ఆడటంలో, తోటి కంటెస్టెంట్స్‌తో ప్రవర్తించే తీరుతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి సొహేల్ గ్రాండ్ ఫినాలేలో విన్నర్ అభిజీత్, రన్నరప్ అఖిల్ సార్థక్‌తో గట్టిగా పోటీపడి టాప్ 3 కంటెస్టెంట్స్‌లో ఒకడిగా నిలిచాడు. అయితే నాగ్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌ను స్వీకరించి, చివరి దాకా నిలవకుండా బయటకు వచ్చేశాడు. విజేతగా నిలవడం కంటే డబ్బు తనకు చాలా అవసరం కాబట్టే ఆ పని చేస్తున్నానని నిజాయితీగా చెప్పేశాడు.
కాగా గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి అనూహ్య రీతిలో సొహేల్‌కు ఓ అరుదైన కానుక ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. హౌస్‌లో సొహేల్ ఆటతీరు, ప్రవర్తన తమ ఇంటిల్లిపాదినీ ఎంతగానో ఆకట్టుకుందని చిరు చెప్పారు. అతని కోసం స్వయంగా తన సతీమణి బిర్యానీ చేసి పంపిందని చెప్పి సొహేల్‌తో పాటు, అందరినీ ఆయన ఆశ్చర్యానికి గురిచేశారు. ఓ వీడియో ద్వారా ఆ బిర్యానీ, దానికి సంబంధించిన కూరను కూడా ఆయన చూపారు. ఆ బిర్యానీని తాను తినడమే కాకుండా, తోటి కంటెస్టెంట్లకు కూడా పెట్టమని సొహేల్‌కు సూచించారు మెగాస్టార్.
తనమీద అభిమానంతో చిరు సతీమణి సురేఖ బిర్యానీ చేసి పంపారనే విషయం ఆయన నోటి నుంచి వినగానే సొహేల్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. ఇది తనకు ఊహించని కానుక అని కన్నీటి పర్యంతమయ్యాడు. తాను ఓ సినిమా తియ్యాలనుకుంటున్నాననీ, దాని ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు గెస్ట్‌గా వస్తే సంతోషిస్తానని సొహేల్ చెప్పగానే, తప్పకుండా తన చేతుల మీదుగా ఆ కార్యక్రమం నడిపిస్తాననీ, అంతే కాకుండా, ఆ సినిమాలో తనకో చిన్న అతిథి పాత్ర ఇస్తే మరింత సంతోషిస్తాననీ చెప్పి చిరంజీవి డబుల్ గిఫ్ట్ ఇచ్చారు.
ఈ డబుల్ ధమాకాతో సొహేల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. స్టేజి మీదున్న చిరంజీవి దగ్గరకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశాడు. సొహేల్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని, అతను భవిష్యత్తులో బాగా ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పారు చిరు.
![]() |
![]() |