![]() |
![]() |

అభిమాని ఊహాచిత్రం వెండితెరపై నిజం అవడం అసాధారణ విషయం. మొదట ఒక గ్లామరస్ హీరోయిన్‌గా, తర్వాత తలైవిగా తమిళ ప్రజల హృదయాల్లో కొలువైన మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆటుపోట్లమయం. అయితే ఆమె సాధన అనితరసాధ్యం. అలాంటి అమ్మ పాత్రలో రమ్యకృష్ణను చూడాలని ఒక అభిమాని ఆశించాడు. 'మదర్.. ద స్టోరీ ఆఫ్ ఎ క్వీన్' అనే పేరుతో జయలలిత గెటప్‌లో రమ్యకృష్ణ ఊహాజనిత చిత్రాన్ని అతను రూపొందించాడు. నాలుగేళ్ల క్రితం అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

ఆ ఊహాచిత్రం విషయం రమ్యకృష్ణ దృష్టికి వెళ్లింది. ఆమె ఫ్రెండ్స్ దాన్ని వాట్సప్ ద్వారా ఆమెకు షేర్ చేశారు. తనను చాలా సార్లు, చాలామంది పత్రికా విలేకరులు మీ డ్రీమ్ రోల్ ఏమిటని అడిగినా అందుకు సమాధానం ఇవ్వలేదనీ, అయితే ఇప్పుడు ఆ ఊహా చిత్రం చూసిన తరువాత జయలలితగా నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు రమ్యకృష్ణ చెప్పారు. ఇదే తన డ్రీమ్ రోల్ అని పేర్కొన్నారు. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నాననీ, అయితే ఆ పాత్రలో జీవించడం చాలా చాలెంజ్‌తో కూడుకుందనీ అన్నారు.
మూడేళ్లు తిరిగేసరికల్లా ఆ ఊహ నిజమవడం గమనార్హం. జయలలిత జీవితం ప్రేరణతో అనితా శివకుమారన్ రచించిన 'క్వీన్' నవల ఆధారంగా అదే పేరుతో తీసిన వెబ్ సిరీస్‌లో టైటిల్ రోల్ రమ్యకృష్ణను వరించింది. రేష్మా ఘటాల స్క్రిప్ట్ సమకూర్చిన ఈ సిరీస్‌కు గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా స్వాగతించిన రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో జీవించారు. సరిగ్గా ఏడాది క్రితం, 2019 డిసెంబర్ 14న ఎంఎక్స్ ప్లేయర్‌లో రిలీజైన 11 భాగాల 'క్వీన్' సీజన్ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జయలలిత స్ఫూర్తితో రూపొందిన శక్తి శేషాద్రి పాత్రలో రమ్యకృష్ణ నటన అందరి ప్రశంసలూ పొందింది. అలా ఒక ఊహ నిజమైంది.

కొసమెరుపు: ఈ సెప్టెంబర్‌లోనే ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జీ సినిమాలు చానల్‌లో ప్రసారమైంది.
![]() |
![]() |