![]() |
![]() |

మలయాళం చిత్రసీమకు చెందిన ఓ యువనటి కేరళలోని లులు మాల్‌లో వేధింపులకు గురయ్యారు. తనకు ఎదురైన అవమానాన్ని ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. మాల్‌కు తన సోదరితో కలిసి వెళ్లాననీ, తామిద్దరినీ ఇద్దరు వ్యక్తులు వెన్నాడి, అభ్యంతరకరంగా స్పృశించారనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమను వేధించిన తర్వాత కూడా వారు తమతో మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు. ఆమె.. 'కుంబళంగి నైట్స్', 'కప్పేలా' మూవీస్‌తో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న అన్నా బెన్.
ఈ ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర మహిళా కమిషన్ కేసు నమోదు చేసింది. ఆ నటి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సు మోటో కేసును నమోదు చేశారు. శనివారం (డిసెంబర్ 19)న సదరు నటి నుంచి కమిషన్ ఆధారాలు సేకరించనుంది. అయితే ఈ ఘటనపై ఆ నటి ఇంతవరకూ పోలీసు కేసు దాఖలు చేయలేదు. అయితే ఈ ఘటన తమ దృష్టికి రావడంతో పోలీసులు మాల్‌లోని సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు.
తాను ఎదుర్కొన్న అనుభవాన్ని అభిమానులతో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వివరంగా అన్నా బెన్ పంచుకున్నారు.
"నేను సోషల్ మీడియాలో తరచూ వచ్చేదాన్ని కాను. కానీ ఈరోజు జరిగినదాన్ని నేను అలా వదిలేయాలనుకోలేను. లులు హైపర్‌మార్కెట్‌లో సాధారణంగా ఖాళీగా ఉండే ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు నన్ను దాటుకుంటూ వెళ్లారు. వారిలో ఒకరు నన్ను దాటే సమయంలో తన చేతిని నా వీపుపై పెట్టారు. అనుకోకుండా జరిగిందనుకొని వెంటనే నేను స్పందించలేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేయాలనుకున్నాను. కానీ అందులో ఏదైనా తేడా ఉందంటే అది మనకు తెలుస్తుంది. నాకు దగ్గరలోనే ఉన్న నా సిస్టర్ దీన్ని స్పష్టంగా చూసింది. తను నా దగ్గరకు వచ్చి అంతా ఓకేనా అని అడిగింది. నేను స్పష్టతలో నేను. అది ఉద్దేశపూర్వకంగా చేసిందని తను చెప్పింది. ఓ నిమిషం మౌనంగా ఉండి, వాళ్ల దగ్గరకు నడిచాను. నాకు అర్థమైందని గ్రహించి వాళ్లు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
మేమిద్దరం కూరగాయల మార్కెట్ దగ్గరున్న మా అమ్మ, బ్రదర్ వాళ్ల వద్దకు వెళ్లాం. ఆ తర్వాత బిల్లు కట్టడానికి నేను, నా సిస్టర్ లైన్‌లో నిల్చొని ఉన్నప్పుడు వారు మళ్లీ అక్కడికి వచ్చారు. నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. నేను పనిచేసిన సినిమాల పేర్లు అడిగాడు. వాళ్ల పనేదో వాళ్లను చూసుకోమని చెప్పాను. మా దగ్గరకు మా అమ్మ వస్తుండటం చూసి వాళ్లు వెళ్లిపోయారు. ఇలాంటి అనుభవం ఇదే మొదటిసారి కాదు నాకు. కానీ ప్రతిసారీ ఆ అనుభవం భిన్నంగా ఉంటుంది.
ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ ప్రతి నిమిషం నన్ను నేను కాపాడుకుంటూ రావాల్సి వస్తుండటంతో ఒక స్త్రీగా అలసిపోతున్నాను. వంగినా, తిరిగినా నా దుస్తుల్ని చూసుకోవాలి. జనం మధ్యలో ఉంటే నా ఛాతీకి రక్షణగా నా చేతుల్ని పెట్టుకోవాలి. ఈ లిస్ట్ ఇలా కొనసాగుతుంటుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు, అవే పనులు చేయాల్సి వచ్చే మా అమ్మ గురించీ, మా సిస్టర్ గురించీ, నా ఫ్రెండ్స్ గురించీ వర్రీ అవుతుంటాను.
ఇదంతా ఈ జబ్బుపడిన మగవాళ్ల వల్లే. మీరు మా భద్రతను తీసేసుకుంటారు. మా సౌకర్యాన్నీ, మా స్త్రీత్వపు ఆనందాన్నీ తీసేసుకుంటారు. నేను మిమ్మల్ని తృణీకరిస్తున్నా. దీన్ని చదివిన స్త్రీలందరూ, ఈరోజు నాకులేని ధైర్యంతో, అలాంటి మగవాళ్లకు గట్టిగా చెంపదెబ్బలను ఇస్తారని ఆశిస్తున్నా" అని ఆమె సుదీర్ఘమైన నోట్ పెట్టారు.
![]() |
![]() |