పేరుపొందిన బందిపోటు వీరప్పన్ జీవితంపై నాలుగేళ్ల క్రితం రామ్‌గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' మూవీని రూపొందించారు. ఇప్పుడు వీరప్పన్ కథతో రెండు వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. సౌత్ ఇండియాలోని పాపులర్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్ వీరప్పన్‌పై ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మాజీ అడిషనల్ డీజీపీ విజయ్‌కుమార్ రాసిన 'వీరప్పన్: చేజింగ్ ద బ్రిగండ్' పుస్తకం ఆధారంగా దాన్ని తీసేందుకు హక్కులు సంపాదించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలియజేసిన ఆ సంస్థ త్వరలోనే ఆ వెబ్ సిరీస్‌కు పనిచేసే క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను వెల్లడిస్తామని చెప్పింది. 'అర్జున్‌రెడ్డి' మూవీని తమిళంలో ధ్రువ్ విక్రమ్‌తో 'ఆదిత్యవర్మ' టైటిల్‌తో రీమేక్ చేసింది ఈ సంస్థే.
వీరప్పన్‌పై అనౌన్స్ చేసిన రెండో వెబ్ సిరీస్ ఇది. దీనికంటే ముందు 'అట్టహాస' డైరెక్టర్ ఏఎంఆర్ రమేశ్ 10 ఎపిసోడ్లతో వీరప్పన్ సిరీస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో వీరప్పన్ క్యారెక్టర్‌ను తెలుగువాళ్లకు కూడా బాగా తెలిసిన కిశోర్ పోషించనుండగా, వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసాఫీసర్ రోల్‌ను బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి చేయనున్నాడు. ఈ సిరీస్‌కు రమేశ్ స్వయంగా రచన చేస్తుండగా విజయ్ శంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగస్ట్ 10 నుంచి 60 రోజుల పాటు నిర్వహించే షెడ్యూల్‌లో ఈ సిరీస్‌ను పూర్తి చేయాలని రమేశ్ సంకల్పించాడు. బెంగళూరు, కర్ణాటక అడవుల్లో షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో రవి కాలే, సంపత్, రాయ్ లక్ష్మి, విజయలక్ష్మి, సుచేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు చేయనున్నారు.