మాలీవుడ్ లో మల్టిటాలెంటెడ్ గా గుర్తింపు పొందారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఒకవైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు దర్శకుడిగానూ, గాయకుడిగానూ, నిర్మాతగానూ, పంపిణీదారుడిగానూ, యాక్షన్ కొరియోగ్రాఫర్ గానూ మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్నారాయన. కరోనా లాక్ డౌన్ కి ముందు `డ్రైవింగ్ లైసెన్స్`, `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ హిట్స్ అందుకున్న పృథ్వీ... కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `కోల్డ్ కేస్`, `కురుతి` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ హిట్స్ అందుకుని వార్తల్లో నిలిచారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఆ రెండు సినిమాలు కూడా థ్రిల్లర్ మూవీస్ గానే తెరకెక్కాయి. అంతేకాదు.. అతి త్వరలో మరో థ్రిల్లర్ మూవీతో పృథ్వీరాజ్ అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయబోతున్నారు. ఆ చిత్రమే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా తెరకెక్కిన `భ్రమమ్`. మాతృకలో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధుడి పాత్రలో పృథ్వీ ఎంటర్టైన్ చేయనున్నారు. జూన్ లో `కోల్డ్ కేస్`, ఆగస్టులో `కురుతి`తో మురిపించిన పృథ్వీ.. అక్టోబర్ 7న స్ట్రీమ్ కానున్న `భ్రమమ్`తో అమెజాన్ ప్రైమ్ లో థ్రిల్లింగ్ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.