![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా'. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాని పూర్తిస్థాయి మాస్ లుక్ లో కనిపిస్తుండటంతో దసరాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.
దసరా మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. "వీర్లపల్లి.. చుట్టూరా బొగ్గు కుప్పలు.. తొంగి చూస్తే గానీ కనిపియ్యని ఊరు. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటుపడిన సంప్రదాయం" అంటూ నాని వాయిస్ తో టీజర్ మొదలైంది. విజువల్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. నాని గెటప్, బాడీ ల్యాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. బొగ్గుగనుల నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. "నీయవ్వ ఎట్లయితే గట్లాయె.. గుండు గుత్తగా లేపేద్దాం బాంచన్" అంటూ తెలంగాణ యాసలో డైలాగ్స్ తో నాని అదరగొట్టాడు. టీజర్ చివరిలో కత్తికి ఉన్న నెత్తుటితో నాని వీర తిలకం పెట్టుకున్న షాట్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. సత్యం సూర్యన్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ని మరో మెట్టు ఎక్కించాయి.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మార్చి 30న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
![]() |
![]() |