![]() |
![]() |

వెబ్ సిరీస్: ఏటీఎం
నటీనటులు: వి జె సన్నీ, పృథ్వీరాజ్, సుబ్బరాజు, దివి, దివ్యావాణి తదితరులు.
కథ: హరీశ్ శంకర్
ప్రొడ్యూసర్: దిల్ రాజు
డైరెక్టర్: సి చంద్రమోహన్
ఎడిటింగ్: అశ్విన్
మాటలు: విజయ్ ముత్యం, సీపీ ఇమ్మాన్యుయేల్.
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: జి మోనిక్ కుమార్
ఓటీటీ: జీ5
కథ :
జగన్ ది హైదరాబాద్ లోని ఒక బస్తీ. చిన్నప్పుడే అమ్మను కోల్పోతాడు. నాన్న ఒక లారీ నడుపుతుంటాడు. జగన్ ని పెంచే స్థోమత లేక చదువుని మధ్యలో ఆపించేస్తాడు. నాన్న మీద కోపంతో లైఫ్ లో బాగా డబ్బులు సంపాదించాలి. ఎంజాయ్ చెయ్యాలి. కానీ మా నాన్నలా ఉండకూడదు అని అనుకుంటూ పెరుగుతాడు జగన్. అతనిలాగే కష్టాలు పడుతున్న మరో ముగ్గురు స్నేహితులుగా అవుతారు. ఇక ఈ నలుగురు కలసి తమ జల్సాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఒక రోజు ఒక కార్ ని కొట్టేస్తారు. దాన్ని ఇరవై వేలకు అమ్మేస్తారు. ఆ తర్వాత ఆ కార్ ఓనర్ వచ్చి కార్ లో పది కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయని చెప్పేసరికి జగన్ గ్యాంగ్ షాక్ అవుతారు. ఆ తర్వాత కార్ ఓనర్ జగన్ గ్యాంగ్ కి పది కోట్లు తీసుకురమ్మని పది రోజుల గడువు ఇస్తాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఏటీఎమ్ లకు డబ్బుని తీసుకెళ్ళే సెక్యూరిటీ వ్యాన్ ని దొంగిలిస్తారు. అయితే ఈ వ్యాన్ లో ఇరవై అయిదు కోట్లు ఉంటాయి. ఈ వ్యాన్ దొంగిలించిన వ్యాన్ ని పట్టుకునేందుకు ఏసీపీ హెగ్డే వస్తాడు. అయితే ఈ హెగ్డే స్థానిక బస్తీ కార్పొరేటర్ గజేంద్రను అరెస్టు చేస్తాడు. హెగ్డే జగన్ గ్యాంగ్ ని పట్టుకుంటాడా? అసలు గజేంద్రని ఎందుకు అరెస్ట్ చేసాడు? గజేంద్రకి, జగన్ స్కెచ్ కి ఏమైనా సంబంధం ఉందా? తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఏటిఎమ్ అనగానే ప్రేక్షకులకు డబ్బు గురించి అని అర్థమై ఉంటుంది. సాదాసీదాగా బస్తీలో జల్సాగా తిరుగుతూ తమ విలాసల కోసం అడ్డదార్లలో డబ్బు సొంతం చేసుకోవాలనుకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల కోవకు చెందిందే ఈ 'ఏటీఎమ్' వెబ్ సిరిస్. ఇది మొత్తంగా ఎనిమిది పార్ట్ లుగా రిలీజ్ చేశారు. మొదడి మూడు పార్ట్ లలో.. జగన్ ఫ్యామీలీ, బాల్యం, స్నేహితులతో జల్సాలు, చిన్న చిన్న చోరీలు.. కార్పోరేటర్ గజేంద్ర పాలిటిక్స్, సీఐ ఉమాదేవి ఇగోతో కూడిన డ్యూటీ.. ఇలా కాస్త నెమ్మదిగా కథ సాగుతూ ఉంటుంది. నాలుగవ ఎపిసోడ్‌లో హెగ్డే రాకతో కథలో ఆసక్తి కలుగుతుంది. హెగ్డే గెస్ చేసే విధానం... జగన్ చేసే మాస్టర్ ప్లాన్ ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది.
జగన్ గ్యాంగ్ ప్లాన్ ని ముందుగానే పసిగట్టిన హెగ్డే వాళ్ళు ఉండే చోటును కనిపెట్టేస్తాడు. అయితే మొత్తం డబ్బుని రికవరీ చేయలేకపోతాడు. గజేంద్రను ఇంటారాగేట్ చేసిన హెగ్డే కు నిజం తెలిసిందా? జగన్ గ్యాంగ్ కి సాయం చేసిన వ్యక్తి ఎవరు? గజేంద్రకి, జగన్ కి మధ్య ఉన్న గొడవేంటి? అన్న ప్రశ్నలు ప్రేక్షకులకు వదిలిపెట్టి సీజన్-2 పై ఆసక్తిని రేకెత్తించాడు డైరెక్టర్. చిన్న సినిమాలైనా కథ బాగుంటే ప్రేక్షకులు క్యూ కడతారు. అలాంటిదే ఈ సిరీస్.
ప్రతీ ఎపిసోడ్‌లో రివీల్ అయ్యే ఒక్కో క్లూతో కథలో కొత్తదనం కనిపిస్తుంది. హెగ్డే ఇన్వెస్టిగేషన్ స్టైల్, జగన్ ఇంటెలిజెన్స్ తో ఎత్తుకు పైఎత్తు లా సాగే ట్విస్ట్ లు ప్రేక్షకులను చివరి వరకూ ఎంగేజ్ చేస్తాయి. మధ్యలో హెగ్డే, కానిస్టేబుల్ దాస్ మధ్య జరిగే సీన్స్ నవ్విస్తాయి.
నటీనటుల పనితీరు:
విజే సన్నీ ఒక బస్తీ యువకుడిలా జగన్ పాత్రలో ఒదిగిపోయాడు. తన ఫ్రెండ్స్ పాత్రలలో కృష్ణ బూరుగుల, రవిరాజ్, రోయిల్ శ్రీ పర్వాలేదనిపించారు. సిఐ గా చేసిన దివ్యవాణి పాత్ర చూడాటానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. హెగ్డే పాత్రలో సుబ్బరాజు ఆకట్టుకున్నాడు. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సుబ్బరాజు హెగ్డే పాత్రకి న్యాయం చేశాడు. గజేంద్ర పాత్రలో పృథ్వీరాజ్ సీరియస్ నెస్ ని, కామెడీని సమానంగా పండించాడు. ఇక హీరో ఫ్రెండ్ లవర్ గా కనిపించిన దివిని ముద్దు సీన్ల కోసమే తీసుకున్నట్టుగా అనిపించింది. ప్రశాంత్ విహారి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మోనిక్ కూమార్ సినిమాటోగ్రఫీ అదుర్స్ అనిపిస్తుంది. ఎడిటర్ అశ్విన్ మొదటి మూడు ఎపిసోడ్ లలో స్లోగా సాగిన కొన్ని సీన్లను కట్ చేసి ఉంటే బాగుండేది. డైరెక్టర్ కథని నడపిన తీరు బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కథకి బలంగా నిలిచింది.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కథని తెరకెక్కించిన తీరు బాగుంది. మొదట స్లో క్యారెక్టరైజేషన్, కొన్ని లిప్ లాక్ లు వదిలేస్తే... ఆకట్టుకునే సంభాషణలు.. పోలీసుల ప్లాన్, హీరో వేసే మాస్టర్ ప్లాన్ తో ఎంగేజ్ చేసే విధానంతో పాటు ఒక్కో క్లూతో రివీల్ అయ్యే ట్విస్ట్ మొత్తంగా.. ఓ మంచి వెబ్ సిరిస్ ని చూశాం అనే ఫీలింగ్ ని ఇస్తుంది.
రేటింగ్ : 3 /5
✍🏻. దాసరి మల్లేశ్
![]() |
![]() |