English | Telugu

ఆ తప్పు మళ్లీ చేయను.. ఇదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌!

ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. జయమాలిని, జ్యోతిలక్ష్మీ, సిల్క్‌ స్మిత, అనురాధ వంటి వారు ఐటమ్‌ సాంగ్స్‌కి వన్నె తెచ్చినవారిలో ముఖ్యులు. కాలం మారింది, ఐటమ్‌ సాంగ్స్‌ కూడా కొత్త పుంతలు తొక్కి స్పెషల్‌ సాంగ్స్‌గా అవతరించాయి. ఐటమ్‌ గాళ్స్‌ స్థానంలో హీరోయిన్లు వచ్చి చేరారు. హీరోయిన్లుగా నటిస్తూనే సైడ్‌ బిజినెస్‌గా అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌ చేసేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పద్ధతి నడుస్తోంది. ఈరోజుల్లో ఒక సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ ఉందీ అంటే ఎవరితో చేయించాలి అని జుట్టు పీక్కోవక్కర్లేదు. ఎందుకంటే హీరోయిన్లు దానికి అందుబాటులోనే ఉంటారు. కాకపోతే వారు డిమాండ్‌ చేసే రెమ్యునరేషన్‌ మాత్రం నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. వారు కోరింది ఇస్తే అందాలు ఆరబోస్తారు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది స్పెషల్‌ సాంగ్స్‌ చేసి కుర్రకారుకి మత్తెక్కించారు. తాజాగా వారి సరసన కుర్ర హీరోయిన్‌ శ్రీలీల కూడా చేరింది. 

‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటా మావా..’ సాంగ్‌లో సమంత ఎంత రెచ్చిపోయి డాన్స్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి ఆ పాట పెద్ద ఎస్సెట్‌ అయింది. ‘పుష్ప2’లోని స్పెషల్‌ సాంగ్‌ దాన్ని మించి ఉండాలని భావించారు సుకుమార్‌. అందుకే ఎవరితో ఆ పాట చేయించాలి అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరికి శ్రీలీలను ఫైనల్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో స్టెప్పులు ఇరగదీసే హీరోయిన్‌ ఎవరు అంటే అందరూ శ్రీలీల పేరే చెబుతారు. అందుకే ‘కిస్సిక్‌’ సాంగ్‌ కోసం ఆమెను ఒప్పించారు. పాట పరంగా ‘ఊ అంటావా..’ కంటే ‘కిస్సిక్‌’ కాస్త నాసిరకంగా ఉన్నప్పటికీ డాన్స్‌ విషయంలో మాత్రం శ్రీలీల తగ్గేదేలే అంటూ స్టెప్స్‌ అదరగొట్టిందని చెప్పుకుంటున్నారు. 

తాజా సమాచారం ఏమిటంటే.. శ్రీలీల ఇకపై స్పెషల్‌ సాంగ్స్‌ చేయదట. ఇదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ అంటోంది. శ్రీలీలలోని ప్లస్‌ పాయింట్స్‌లో డాన్స్‌ ప్రధానమైంది. అందుకే అంతకుముందు కూడా చాలా సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ ఆఫర్లు వచ్చాయి. కానీ, వాటిని తిరస్కరించింది. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో కూడా ఒక స్పెషల్‌ సాంగ్‌ ఉంది. దాని కోసం మొదట శ్రీలీలలే అప్రోచ్‌ అయ్యారు. కానీ, ఆమె నో చెప్పింది. ‘పుష్ప2’లో మాత్రం చెయ్యడానికి ప్రధాన కారణం ఆ సినిమాకి ఉన్న క్రేజ్‌, అలాగే అల్లు అర్జున్‌తో డాన్స్‌ చెయ్యాలని శ్రీలీలకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అందుకే ఆ పాట కోసం తనను సంప్రదించిన వెంటనే ఓకే చెప్పింది. అయితే ‘పుష్ప2’లోని సాంగ్‌ హిట్‌ అయినా, కాకపోయినా తను మాత్రం స్పెషల్‌ సాంగ్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అలాంటి పాటలు చేయడం వల్ల రెమ్యునరేషన్‌ భారీగానే వస్తుంది. కానీ, ఐటమ్‌ గాళ్‌ అనే ముద్రపడిపోతుందనేది శ్రీలీల భయం. అందుకే ‘పుష్ప2’ కోసం చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చెయ్యనని, అదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ అని చెబుతోంది.