అక్కినేని నాగార్జున తన పెద్ద కుమారుడు నాగ చైతన్యతో కలిసి 'మనం', 'బంగార్రాజు' వంటి మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. అయితే చిన్న కుమారుడు అఖిల్ తో కలిసి ఇంతవరకు ఒక్క మల్టీస్టారర్ కూడా చేయలేదు. 'మనం'లో అఖిల్ నటించినప్పటికీ అది అతిథి పాత్ర మాత్రమే. దీంతో నాగార్జున-అఖిల్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారి కోరిక త్వరలోనే నెరవేరనుందని తెలుస్తోంది.
గతేడాది 'ది ఘోస్ట్'తో నిరాశపరిచిన నాగార్జున తన తదుపరి చిత్రాన్ని 'ధమాకా' రైటర్ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాతి చిత్రాన్ని 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది నాగార్జున కెరీర్ లో 100వ సినిమా. అందుకే దీనిని తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని నాగార్జున భావిస్తున్నారు. అంతేకాకుండా ఇది మల్టీస్టారర్ స్క్రిప్ట్ అని.. ఇందులో నాగార్జునతో పాటు అఖిల్ నటించనున్నాడని సమాచారం. నాగార్జున 100వ చిత్రం కావడంతో నాగ చైతన్య కూడా ప్రత్యేక పాత్రలో మెరిసినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. మరి ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మరో మెమరబుల్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.