'వాల్తేరు వీరయ్య' సక్సెస్ తో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. 'ఆచార్య', 'గాడ్ ఫాదర్' సినిమాలతో మెగా రేంజ్ కలెక్షన్లు రాబట్టలేకపోయిన ఆయన.. 'వాల్తేరు వీరయ్య'తో లెక్క సరిచేశారు. ఫ్యాన్స్ ని, మాస్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ఇక నుంచి ఇలాంటి మాస్ ఎంటర్టైనర్స్ చేసి మెప్పిస్తానని చిరంజీవి ప్రకటించారు. అన్నట్లుగానే ఓ మాస్ ఎంటర్టైనర్ కోసం దర్శకుడు త్రినాథరావు నక్కిన చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' అనే ఫిల్మ్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. దీని తర్వాత మెగాస్టార్ చేయబోయే చిత్రం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు త్రినాథరావు నక్కిన పేరు తెరపైకి వచ్చింది.
ఇటీవల మాస్ మహారాజా నటించిన 'ధమాకా'తో ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు త్రినాథరావు. ఈ చిత్రం వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో మెగాస్టార్ దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రినాథరావుకి మాస్ పల్స్ తెలుసు, పైగా తన కామెడీ టైమింగ్ ని బాగా ఉపయోగించుకోగలడన్న ఉద్దేశంతోనే చిరంజీవి ఆయనకు అవకాశం ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారని సమాచారం.