నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన డెబ్యూ మూవీ ఆ దర్శకుడితో ఉంటుంది, ఈ దర్శకుడితో ఉంటుందంటూ రకరకాల పేర్లు వినిపించాయి. 'ఆదిత్య 369' సీక్వెల్ తో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని కూడా బాలకృష్ణ భావించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రానున్న నాలుగో సినిమాతో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానున్నాడని సమాచారం.
బాలకృష్ణ, బోయపాటి కలయికలో ఇప్పటిదాకా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' అనే మూడు సినిమాలు రాగా.. మూడూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ బ్లాక్ బస్టర్ కాంబో నాలుగోసారి కూడా చేతులు కలపబోతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ 'NBK 108' చేస్తుండగా.. మరోవైపు బోయపాటి ఏమో రామ్ పోతినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తయ్యాక బాలయ్య-బోయపాటి నాలుగో సినిమా పట్టాలెక్కే అవకాశముంది. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ మెరవనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే కీలకమైన పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడని న్యూస్ వినిపిస్తోంది. మొదటి సినిమాలోనే తండ్రితో తెరను పంచుకోనున్న మోక్షజ్ఞ అభిమానులను ఎంతగా అలరిస్తాడో చూడాలి. ఈ సినిమా తర్వాత ఆయన సోలో హీరోగా సినిమా ఉంటుందని వినికిడి. మరి మోక్షజ్ఞ సోలో హీరోగా నటించనున్న డెబ్యూ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.