మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ అని ప్రచారం జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు తన బలప్రదర్శనలతో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలపడం', 'రెండు కార్లకి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని ఆ కార్లను కదలకుండా ఆపడం', 'ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపడం' వంటి ఊహించని బల ప్రదర్శనలు ఆయన చేసినట్లు చరిత్ర చెబుతోంది. కలియుగ భీమ, జయవీర హనుమాన్ గా పేరున్న ఆ యోధుడి బయోపిక్ తీయాలనుకోవడం సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసానికే రామ్ చరణ్ సిద్ధమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. నిజమైతే మాత్రం రామ్మూర్తి నాయుడు పాత్రలో రామ్ చరణ్ ఎలా అలరిస్తాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.