![]() |
![]() |

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దాదాపు స్టార్ హీరోలంతా భారీ సినిమాలే చేస్తున్నారు. దీంతో ఒక్కో సినిమా పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు అవుతుంది. ఓ వైపు హీరోల మార్కెట్ పెరుగుతుందన్న ఆనందం అభిమానుల్లో ఉన్నప్పటికీ.. అదే సమయంలో కనీసం ఏడాదికి ఒక్కసారి కూడా తమ హీరోని స్క్రీన్ పై చూసుకోలేకపోతున్నామన్న బాధ అభిమానుల్లో ఉంది. అందుకే, పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. తెలుగు ఆడియన్స్ కోసం తక్కువ రోజుల్లో పూర్తయ్యే సినిమాలు కూడా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎట్టకేలకు అభిమానుల బాధ ఒక స్టార్ హీరోకి అర్థమైంది. అల్లు అర్జున్ తన అభిమానులు, తెలుగు ఆడియన్స్ కోసం.. ఒక ప్రోపర్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా 'సరైనోడు-2' అని సమాచారం. (Allu Arjun)
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'సరైనోడు' మూవీ 2016 లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ ని బోయపాటి చూపించిన తీరుకి, యాక్షన్ సీన్స్ కి, ఎమోషన్స్ కి, సాంగ్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బన్నీ అభిమానులు, యాక్షన్ ప్రియుల మెప్పు పొందిన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. బన్నీ-బోయపాటి కాంబోలో మరో మూవీ రావాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. నిజానికి అల్లు అరవింద్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వీరి కాంబోలో మరో సినిమా చేయాలని ఎప్పటినుంచో చూస్తున్నారు. కానీ, ఎందుకనో ముహూర్తం కుదరట్లేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు బన్నీ-బోయపాటి సెకండ్ ఫిల్మ్ కి ముహూర్తం కుదిరిందని, పైగా వీరి కాంబోలో 'సరైనోడు-2' వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. (Sarrainodu 2)
'పుష్ప-2'తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. తన తదుపరి సినిమాని అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశముంది. అయితే దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటిదాకా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే బన్నీ మాత్రం బోయపాటితోనే నెక్స్ట్ మూవీ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. (Boyapati Srinu)
వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే వెళ్తే.. ఒక్కో సినిమా విడుదల కావడానికి రెండు మూడేళ్లు పడుతుంది. దీంతో ఫ్యాన్స్ నిరాశచెందుతారు. ప్రేక్షకులతో కూడా హీరోకి గ్యాప్ ఏర్పడుతుంది. అందుకే పాన్ ఇండియా సినిమాల మధ్యలో.. ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ సినిమాలు చేస్తే బాగుంటుందని అరవింద్ చెప్పారట. పైగా, బోయపాటి లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తే.. మాస్ కి మరింత చేరువ కావొచ్చని సూచించారట. అరవింద్ చెప్పిన దానికి కన్విన్స్ అయిన బన్నీ.. అట్లీ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి కాగానే, బోయపాటి ప్రాజెక్ట్ ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట.
బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో 'అఖండ-2' మూవీ చేస్తున్నారు. ఇది డిసెంబర్ లేదా జనవరిలో విడుదల కానుంది. దీని తర్వాత బోయపాటి 'సరైనోడు-2' పనులు మొదలు పెడతారని టాక్. ఇప్పటికే బోయపాటి స్టోరీ లైన్ కూడా వినిపించారని.. దానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇద్దరూ కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2026 ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
![]() |
![]() |