![]() |
![]() |

తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నటులలో మంచు మోహన్ బాబు (Mohan Babu) ఒకరు. హీరో, విలన్ అనే తేడా లేకుండా ఎలాంటి పాత్రలోనైనా మోహన్ బాబు ఒదిగిపోయే తీరు అమోఘం. ముఖ్యంగా విలనిజం పండించడంలో ఆయన రూటే సెపరేటు. అయితే కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించిన మోహన్ బాబు.. ఇప్పుడు మళ్ళీ తనలోని అసలుసిసలైన విలన్ ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఘట్టమనేని వారసుడి సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా ఆయన కనిపించనున్నారని సమాచారం.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన డెబ్యూ ఫిల్మ్ కి 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' చిత్రాలతో గుర్తింపు పొందిన అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతుండటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం.. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'శ్రీనివాస మంగాపురం' అనే టైటిల్ పరిశీలనలో ఉందట.
'శ్రీనివాస మంగాపురం'లో ప్రతినాయకుడి పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట. దీనికి పేరున్న నటుడైతే బాగుంటుందనే ఉద్దేశంతో మూవీ టీం మోహన్ బాబుని సంప్రదించిందట. చిత్ర కథ, తన పాత్ర ఎంతగానో నచ్చిన మోహన్ బాబు.. ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ఆయన విలన్ గా నటిస్తే సినిమాపై అంచనాలు పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. అజయ్ భూపతి తన సినిమాల్లో పాత్రలను మలిచే తీరు బాగుంటుంది. ఇప్పుడు మోహన్ బాబుని ఎలా చూపిస్తారనే ఆసక్తి నెలకొంది.
![]() |
![]() |