నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ సంక్రాంతికి 'వీరసింహారెడ్డి' చిత్రంతో అలరించనున్న ఆయన.. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమాతో వశిష్ట్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ఘన విజయం సాధించడంతో వశిష్ట్ కి మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు తన రెండో సినిమాకి బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వశిష్ట్ కొద్దిరోజుల క్రితం రజినీకాంత్ ని కలవడంతో ఆయనతో సినిమా చేసే అవకాశముందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. వశిష్ట్ ఇటీవల బాలయ్యని కలిసి ఓ కథ వినిపించగా.. ఆ కథ బాగా నచ్చి బాలయ్య మూవీ చేయడానికి వెంటనే ఓకే చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది. బాలకృష్ణ కోసం వశిష్ట్ ఓ విభిన్న కథను సిద్ధం చేసినట్లు సమాచారం. వశిష్ట్ కి ఇలా వరుసగా నందమూరి కాంపౌండ్ లో అవకాశాలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.