ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొన్న శర్వానంద్ కు పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురైతే.. ప్రభాస్ పెళ్లి తర్వాత తన పెళ్లి అని సమాధానం చెప్పి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లెప్పుడో ప్రభాస్ కే తెలుసో లేదో.. అలాంటిది ప్రభాస్ పెళ్లి తర్వాత అంటే ఇక శర్వాకి పెళ్లయినట్లే, మనం చూసినట్లే అనే కామెంట్స్ వినిపించాయి. అదే భయం శర్వాకి కూడా పట్టుకున్నట్లు ఉంది. సడెన్ గా పెళ్లికి రెడీ అయిపోయాడు.
'గమ్యం', 'ప్రస్థానం', 'ఎక్స్ ప్రెస్ రాజా', 'శతమానం భవతి' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే 38 ఏళ్ళ ఈ హీరో ఇంకా పెళ్లి పీటలెక్కకపోవడంతో.. ప్రెస్ మీట్లు, టాక్ షోలలో ఆయనకు పెళ్లి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఇక ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు శర్వా.
హైదరాబాద్ కి చెందిన ఓ యువతితో శర్వా పెళ్లి నిశ్చయమైందని తెలుస్తోంది. యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్న ఆమెను శర్వా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్లు వినికిడి. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగనుందని సమాచారం.