కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'గజిని'(2005) ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. తెలుగులోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని 2008లో మురగదాస్ దర్శకత్వంలోనే ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ చేయగా అక్కడా ఘన విజయం సాధించింది. దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఆమిర్ ఖాన్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీకి సీక్వెల్ చేసే సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
'లాల్ సింగ్ చడ్డా' పరాజయం తర్వాత ఆమిర్ ఖాన్ సినిమాలకు కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆయన దృష్టంతా సౌత్ మీద పడిందట. సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుండటంతో.. సౌత్ ఫిల్మ్ మేకర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో విలన్ రోల్ కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు వార్తలు రాగా.. ఇక ఇప్పుడు గజిని సీక్వెల్ వార్తలొస్తున్నాయి.
ఇటీవల మురగదాస్ గజిని-2 స్క్రిప్ట్ వినిపించగా ఆమిర్ ఖాన్ కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మురగదాస్ ఆయన టీమ్ తో కలిసి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. మధు మంతెన, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.