నాగ చైతన్య, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఏ మాయ చేసావే'. 2010లో విడుదలైన ఈ ప్రేమకథాచిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, చైతన్య-సమంత మధ్య ప్రేమ సన్నివేశాలు కట్టిపడేశాయి. దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుండగా.. అందులో చైతన్య సరసన రష్మిక నటించనుందని తెలుస్తోంది.
చైతన్య హీరోగా నటించిన రెండో సినిమా 'ఏ మాయ చేసావే'తోనే సమంత వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో కలిసి నటించిన చైతన్య, సమంత.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించే అవకాశం లేకపోవడంతో.. 'ఏ మాయ చేసావే-2'లో హీరోయిన్ గా రష్మిక పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
'ఏ మాయ చేసావే' సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చెప్పిన గౌతమ్ మీనన్.. ప్రస్తుతం తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశమున్న ఈ చిత్రంలో రష్మికను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'ఏ మాయ చేసావే'లో జెస్సీ పాత్రలో సమంత నిజంగానే మాయ చేసింది. చీరకట్టులో ఆమెని చూసి కుర్రకారు ఫిదా అయ్యారు. అందం, అభినయంతో మొదటి చిత్రంతోనే సిల్వర్ స్క్రీన్ పై ఒక మ్యాజిక్ చేసింది. ఇక ఆమె పాత్రకు చిన్మయ డబ్బింగ్ కూడా ప్రధాన బలంగా నిలిచింది. ఏది ఏమైనా సమంతను మరిపించేలా జెస్సీ పాత్రను పోషించడమంటే కష్టమనే చెప్పాలి. మరి రష్మిక ఈ ఛాలెంజ్ ని స్వీకరించి, తను కూడా జెస్సీ పాత్రలో ఆ స్థాయిలో మెప్పిస్తుందేమో చూడాలి.