![]() |
![]() |

రీసెంట్ గా 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న మహేష్ 28వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి 'అర్జునుడు' అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ గత నాలుగు చిత్రాల టైటిల్స్ 'అ' అక్షరంతోనే మొదలు కావడం విశేషం. అందులో 'అజ్ఞాతవాసి' మినహా మిగతా మూడు చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ లాస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ సినిమాకి కూడా 'అ' సెంటిమెంట్ ని ఫాలో అవుతూ 'అర్జునుడు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. అయితే గతంలో మహేష్ 'అర్జున్'(2004) టైటిల్ తో సినిమా చేయగా ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్ తన సినిమాకి పెట్టడానికి మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి. మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశముంది.
త్రివిక్రమ్ రైటింగ్ కి, మహేష్ టైమింగ్ కి కరెక్ట్ గా సరిపోతుంది. అందుకే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అయితే గతంలో వీరి కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలకు థియేటర్స్ లో కంటే బుల్లితెరపైనే ఎక్కువ ఆదరణ లభించింది. ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి థియేటర్స్ లోనూ సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
![]() |
![]() |