![]() |
![]() |

'ఆవకాయ్ బిర్యాని' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బిందు మాధవి.. ఆ తర్వాత 'బంపరాఫర్', 'రామ రామ కృష్ణ కృష్ణ', 'పిల్ల జమీందార్' వంటి సినిమాలలో నటించింది. అయితే తెలుగులో ఆమెకి అంతగా ఆదరణ లభించకపోవడంతో పూర్తిగా కోలీవుడ్ సినిమాలతో బిజీ అయింది. అయితే ఇప్పుడు 'బిగ్ బాస్ నాన్ స్టాప్' పుణ్యమా అని బిందుకి టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
నాన్ స్టాప్ పేరుతో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ లో బిందు పార్టిసిపేట్ చేయడమే కాకుండా తనదైన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించి టైటిల్ విన్నర్ గా నిలిచింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క షోతో వచ్చింది. ఈ షో కారణంగా బిందుకి ఎందరో అభిమానులుగా మారారు. అంతేకాదు ఈ షో కారణంగా పలు దర్శకుల దృష్టిలో ఆమె పడిందని అంటున్నారు.
మే 27న 'F3' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని నటసింహం బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బిందు పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో 'F3' టీమ్ తో కలిసి సందడి చేసిన అనిల్ రావిపూడి.. తన నెక్స్ట్ మూవీలో బిందుకి అవకాశమిస్తానని చెప్పడం విశేషం.
![]() |
![]() |