Home »
Abburi Ravi Exclusive Interview
on Aug 10, 2011
2004 లో వచ్చిన "పల్లకిలో పెళ్ళి కూతురు" చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి మాటల రచయితగా ప్రవేశించిన అబ్బూరి రవి ఈ రోజు ఏ ప్రముఖ హీరో సినిమాకైనా సంభాషణలు వ్రాయగలిగే స్థాయికి ఎదిగారు. ఆయన వ్రాసిన సినిమాల్లో అందరికీ బాగా గుర్తుండి పోయే చిత్రం "బొమ్మరిల్లు". ఆయన వ్రాసే మాటలు సుత్తిలేకుండా క్లుప్తంగా, సూటిగా ఉండి మన జీవితాలకు దగ్గరగా ఉంటాయి. అలాగే "కిక్, భగీరథ, అన్నవరం, అతిథి, డాన్, మిస్టర్ పర్ ఫెక్ట్" వంటి అనేక చిత్రాలకు అబ్బూరి రవి మాటలు అందించారు. ప్రస్తుతం ఆయన మాటలు వ్రాసిన "దడ" చిత్రం ఆగస్ట్ 11 వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా తెలుగువన్ ఆయనతో జరిపిన ఎక్స్ క్లూజీవ్ ఇంటర్ వ్యూ మీ కోసం.
1) ఒక మాటల రచయితకు ఉండవలసిన ప్రాథమిక అర్హతలేమిటి....?
జీవితం మీద అవగాహన ఉండాలి. కథనీ, కథలోని పాత్రల్నీ, కథా రచయిత భావాన్నీ అర్థం చేసుకునే తత్వం ఉండాలి. పలు ప్రాంతాల మీద, మన భాష మీద, జీవన విధానం మీద అవగాహన ఉండాలి. పాత్రల్లో కూలీపని నుంచి రాష్ట్రపతి వరకూ ఏ పాత్ర అయినా ఉండొచ్చు కదా...! అందుకని ఆ యా స్థాయి మనుషులు ఏ స్థాయి భాషని మాట్లాడతారో తెలిసి ఉంటే మాటలు నిజానికి దగ్గరగా ఉంటాయి. లేకపోతే ప్లాస్టిక్ ఎమోషన్స్ వస్తాయి. నిజ జీవితంలో మన మాటలకి సినిమాల్లో వాడే మాటలకీ తేడా ఎంత తగ్గితే సినిమా మనకి అంత రీచవుతుందని నా ఫీలింగ్.
2) మీకు సామజిక సేవా కార్యక్రమాలను గుప్తంగా చేస్తుంటారని చాలా మంది అంటూ ఉంటారు. మరి ఒక సినీ రచయితగా సామాజిక బాధ్యత, సామాజిక స్పృహలను మీ రచనల్లో ఎలా చూపిస్తారు...?
సామాజికి బాధ్యత రాసే మాటల్లోనే ఉంటే కూడా ప్రోబ్లెమ్. ఇవాళ డబ్బు వస్తుంది, టైమ్ వేస్ట్ అవదూ అంటే అందరూ సామాజిక బాధ్యత గురించే మాట్లాడతారు. నేను చేస్తున్నది కథకుడు క్రియేట్ చేసిన పాత్రలకి, సందర్భాలకి తగినట్లు మాటలు వ్రాయటం. సందర్భం కుదిరి, పాత్ర చెప్పాల్సి వస్తే, మంచి మాటలు వ్రాసి, మంచి భావాలను ఆడోటోరియమ్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడికీ చేరేలా ప్రయత్నం చేస్తాను. ఇంకా బయట ఏం చేస్తారు అంటే...రెడ్ సిగ్నల్ దగ్గర బైక్ ఆఫ్ చేసి, గ్రీన్ సిగ్నల్ పడగానే ఆన్ చేస్తాను.
అలాగే రూమ్ లోంచి బయటకు వస్తే లైట్స్, ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. సన్ లైట్ ఉంటే రూమ్ లో లైట్ వేయను. వాటర్, గ్యాస్, పెట్రోల్, పవర్, ఫుడ్ వంటివి వేస్ట్ చెయ్యను. ఇవి చిన్న విషయాలుగా సిల్లీగా అనిపించవచ్చు. కానీ నాకు ఇవి, ఇలాంటివి చాలా పెద్దవి. బట్ ఎన్విరోన్ మెంట్ కిది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది.
3) మీరు ఒక ఇమేజ్ ఉన్న టాప్ హీరోలతో పనిచేశారు...నాగచైతన్యకు ఇది నాలుగవ చిత్రం. వాళ్ళ సినిమాలకు వ్రాయటానికీ, ఈ సినిమాకి మాటలు వ్రాయటానికీ తేడా తెలుపండి...!
ఏ సినిమాకైనా ఒకటే పద్ధతి. అంతే కానీ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలకు ఒకలా, కొత్త హీరోల సినిమాలకు ఒకలా వ్రాయటం అంటూ ఉండదు. నేను కథా రచయితకీ, పాత్రలపై, దృశ్యపరంగా దర్శకుడి ఆలోచనలకీ తగ్గ మాటలు వ్రాయాల్సి ఉంటుంది. సో ఒక రైటర్ గా సందర్భం, పాత్రలు దొరికినప్పుడు కచ్చితంగా మంచిని, మంచి భావాలనీ మనసుల్లోకి వెళ్ళేలాగ వ్రాయటానికి ట్రై చేస్తాను.
4) మీరు మాటలు వ్రాసిన "దడ" చిత్రం ఆగస్ట్ 11 న విడుదలవుతుంది. సగటు ప్రేక్షకుడిని ఆకర్షించే అంశాలు "దడ" చిత్రంలో ఏమేం ఉన్నాయి...?
అరుపులు, కేకలు ఉండవ్. డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కెమెరా, లైటింగ్, ఎడిటింగ్ ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకత ఉంటుంది. చైతన్య యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్సెస్ బాగా చేశాడు.
5) మామూలు దర్శకులకీ ..."ఐ.ఐ.టి. ఐ.ఐ.యమ్." చదివినటువంటి అజయ్ భూయాన్ దర్శక శైలికీ మీరు గమనించిన వ్యత్యాసం ఏమిటి....?
చదువుని బట్టి దర్శకులలో పెద్ద తేడా రాదు. లైఫ్ లో ఉన్న ఎక్స్ పోజర్ ని బట్టి, లైఫ్ మీద, సమాజంలో జరిగే విషయాల మీద ఉన్న అవగాహన, సామాజిక ఆర్థిక స్థాయిల మీద, పుట్టి పెరిగిన ప్రాంతం మీద, కథలు, సినిమాల మీద ఉన్న కమాండ్ మీద డిపెండ్ అవుతుంది. అజయ్ ఎంత చదువుకున్నా చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. సినిమాని విపరీతంగా ప్రేమిస్తాడు. ఇగోస్ కన్నా సినిమా పెద్దది అని నమ్ముతాడు. ఫ్రెండ్లీ అండ్ పాజిటీవ్ పర్సన్. నా దృష్టిలో అమ్మ, నాన్నని గౌరవించినట్టు, భార్య, భర్తని ప్రేమించినట్టు, ఫ్రెండ్స్ తో మన లిమిట్స్ లో మనం ఉన్నట్టు....మనం చేసే సినిమాతో కూడా ఉంటే ఆ సినిమా స్థాయి కచ్చితంగా బాగుంటుంది.
6) ఒక సినీ రచయితగా, దర్శకుడితో క్రియెటీవ్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మీరెలా వ్యవహరిస్తారు....? అలాంటి ఛాంలెంజ్ ఏదైనా మీకు "దడ" సినిమాలో ఎదురయ్యిందా....?
చాలా సార్లు భర్త చెప్పింది భార్యకీ, భార్య చెప్పింది భర్తకీ నచ్చదు. కానీ ఎక్కువ సార్లు ఏం జరుగుతుంది...? భర్త మాటే నెగ్గుతుంది. అతన్ని నమ్మి భార్య సైలెంట్ గా ఫాలో అవుతుంది. ఇక్కడ భర్త డైరెక్టర్.
7) హీరోలకు ఉన్న ఇమేజ్ నుంచి, వారి అభిమానుల అంచనాల నుంచీ వారిని కాపాడటానికి మీరు మీ రచనలో అనుసరించే పంథా ఏమిటి....?
ఇమేజ్ ఉన్న హీరోల దగ్గరికి, అంతే స్పాన్ ఉన్న కథలతోనే వెళతారు. సో కథలో ఉంటే మనం స్పెషల్ గా ఏం చెయ్యక్కరలేదు. లేనప్పుడు ఏం చేసినా, ఎంత చేసినా లాభం లేదు...
8) "దడ" సినిమాతో నాగచైతన్యకి తొలిసారి వ్రాస్తున్నారు. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నాగచైతన్యకి యాక్షన్ హీరోగా ఇమేజ్ మార్చే ప్రయత్నం ఏ విధంగా చేశారు......?
ఏంత చెయ్యాలో అంతే చేశాం.
9) నాగార్జునతో "డాన్" సినిమాకి పనిచేశారు...అలాగే నాగచైతన్యకు "దడ" చిత్రానికి కూడా వ్రాశారు....రెండు తరాలకు చెందిన ఈ తండ్రీ కొడుకులకు వ్రాయటంలో రచయితగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు...?
కథని బట్టి, పాత్రని బట్టి నిజాయితీగా రాసుకోవటమే ఎవరైనా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎక్స్ ట్రా ఏం చెప్పినా అబద్ధమే.
10) "దడ" సినిమాలో అభిమనులను ఆకట్టుకునే పవర్ ఫుల్, ట్రెండ్ సెట్టింగ్ డైలగేలేమన్నా ఉంటాయా...?
సినిమాలో ఏ డైలాగునీ స్పెషల్ గా, విడిగా చూడలేము. పాత్రలు ఎంతవరకూ అవసరమో అంతే మాట్లాడతాయి.
11) "దడ" హీరో నాగచైతన్య తెలుగు డైలాగులు చెప్పటంలో ఇబ్బంది ఎదుర్కొంటాడని అంటారు....కనుక ఈ చిత్రంలో లెందీ డైలాగులు కాకుండా క్రిస్ప్ గా మాటలు వ్రాసారా....?
చైతన్యకి ఆ ప్రోబ్లెమ్ ఉందని నాకనిపించలేదు. అండ్ దట్ టూ ఒక పేజీ డైలాగు వ్రాశారూ అంటే అక్కడ చెప్పవలసింది అంత ఉందీ అని అర్థం. లేనప్పుడు అంతబారు డైలాగు చెప్పటానికే కాదు...చూడటానికి కూడా ఇబ్బందే.
12) చివరిగా... దాసరి నుంచీ త్రివిక్రమ్, వీరూ పోట్ల, విజయేంద్ర ప్రసాద్ వరకూ చాలా మంది రచయితలు దర్శకులుగా మారారు. ఇంకా కోన వెంకట్ వంటి మరి కొందరు కూడా దర్శకులుగా మారే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే భవిష్యత్తులో మీకు కూడా దర్శకుడిగా మారే ఆలోచనేమన్న ఉందా...?
చేస్తాను... అందరూ చేస్తున్నారని కాదు. నేను రాసుకున్న కథని నేనే చెప్పాలి అనుకున్నప్పుడు. సో టైమ్ పడుతుంది. ఐయామ్ స్టిల్ లెర్నింగ్. నా దృష్టిలో డైరెక్షన్ చెయ్యటానికి...శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలి. వోపిక ఉండాలి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. అహంకారాన్ని చంపుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే అపారమైన ఏకాగ్రత కావాలి. ఇవి ఉంటే డైరెక్షన్ చెయ్యటం చాలా ఈజీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



.jpg)
