సాహితీ తోటలో నవ్వుల పూవులు పూయించిన ముళ్ళపూడి వెంకటరమణ ఇక లేరు అంటే నమ్మబుద్ధి కావడంలేదు. అలా అనుకోడానికే బాధగా ఉంది. వెలితిగా ఉంది. ముళ్ళపూడి తన హాస్య రచనల పరిమళాలను ఆస్వాదించమంటూ తాను వెళ్ళిపోయారు.
నవరసాల్లో హృద్యమైన హాస్యం యమా రుచిగా ఉంటుంది కానీ దాన్ని సృష్టించడం మహా కష్టం. కాస్త ఎక్కువైనా, తక్కువైనా పేలదు. హాస్యం కాస్తా అపహాస్యం అయిపోతుంది. అందుకే హాస్యం రాసేవాళ్ళు తెలుగులోనే కాదు మొత్తం ప్రపంచంలోనే బహు తక్కువ. అలాంటి అరుదైన హాస్య రచయితల్లో ముళ్ళపూడి ఒకరు.
1931 జూన్ 28 న పుట్టిన ముళ్ళపూడి – 14 ఏళ్ల వయసులోనే "అమ్మ మాట వినకపోతే" అంటూ కధ రాశారు. “బాల" పత్రికలో అచ్చయిన ఆ కధకు బాపు బొమ్మ వేశారు. 1953 లో ఆంద్ర పత్రికలో రిపోర్టర్ గా చేరడంతో ముళ్ళపూడి కెరీర్ మొదలైంది. ఆ పత్రికా వాతావరణం, నండూరి రామమోహనరావు, పిలకా గణపతి శాస్త్రి, సూరంపూడి సీతారాం లాంటి సాహితీ ఉద్దండులతో పరిచయం ముళ్ళపూడిని రచయితగా మలచింది. ఇక ఆయన వృత్తి, ప్రవృత్తి కూడా రాయడమే అయింది. తుది శ్వాస విదిచేవరకూ సాహితీ సృజన లోనే నిమగ్నమయ్యారు.
ముళ్ళపూడి సృష్టించిన "బుడుగు"లో మన అల్లరి పిల్లలు కనిపిస్తారు. ఆయన ఏం రాసినా చమక్కులు, ఛలోక్తులతో కళాఖండాల్లా భాసిస్తాయి. ముళ్ళపూడి తీర్చిదిద్దిన రాధ, గోపాలం లాంటి ప్రతి పాత్రా సహజ సుందరంగా ఉంటుంది. "కేవలం నవ్వించేది కాదు, ఓ కన్నీటి చుక్కను కూడా తెప్పించేదే ఉత్తమ హాస్యం" అంటారు. నవ్వెప్పుడూ విషాదంలోంచే పుడుతుంది మరి. అలా ముళ్ళపూడి రచనలు నవ్వులకే పరిమితం కావు. ఆలోచనలు రేకెత్తిస్తాయి, విజ్ఞతను పెంచుతాయి.
ముళ్ళపూడి తన జీవితాన్ని "కోతి కొమ్మచ్చి" గా మనకు అందించారు. పేరుకు తగ్గట్టే అది ఒక పద్ధతిలో, ఒక వరసన సాగదు. కొన్ని కొన్ని సందర్భాలు, సన్నివేశాలతో కవ్విస్తూ, నవ్విస్తూ ఎనలేని ఆనందాన్ని అందిస్తుంది.
|
స్నేహానికి నిర్వచనం బాపూ రమణల దోస్తీ. 1942 లో అంటే 11 ఏళ్ల ప్రాయంలో స్కూల్లో ఏర్పడిన వారి పరిచయం, తనువులే వేరు కానీ మనసులు ఒకటే అన్నట్టు చివరివరకూ కొనసాగింది. ముళ్ళపూడి మాటకు బాపూ బొమ్మ తోడైంది. చిట్టిపొట్టి కధలు మొదలు సినిమాల వరకూ ఏం చేసినా ఇద్దరూ కలిసే చేశారు. మనసా వాచా కర్మణా ఇద్దరూ ఒకరికోసం ఒకరు అన్నట్లు జీవించారు. ముళ్ళపూడి కధ, స్క్రీన్ ప్లే, డైలాగులు రాస్తే, ఆర్టిస్టు, ఫిల్మ్ మేకర్ అయిన బాపూ వాటిని మరింత అందంగా తెరకెక్కించారు.
1962 లో విడుదలైన "రక్తసంబంధం" చిత్రంతో ముళ్ళపూడి సినీ జీవితం మొదలైంది. ఇక అక్కణ్ణించీ మూగ మనసులు, దాగుడుమూతలు, కన్నె మనసులు, నవరాత్రి, పూలరంగడు, సాక్షి, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, సీతా కల్యా ణం, త్యాగయ్య, ముత్యాలముగ్గు, భక్త కన్నప్ప, జీవన జ్యోతి, జాకీ, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, రాధాగోపాళం - ఇలా ఎన్ని ఆణిముత్యాలో! సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా ముళ్ళపూడి కలం దేన్నయినా పండించింది. చదువరులకు, ప్రేక్షకులకు విందు చేసింది. ఆయన ఆఖరి సినిమా "శ్రీరామ రాజ్యం " రేపు జూనులో విడుదల కావలసి వుండగా తొందరపడి ఆకాశ లోకాలకు ఎగసిపోయారు.
సిసలైన రచయితలు సన్మానాలు, సత్కారాలకు దూరంగానే ఉంటారనే నానుడి ముళ్ళపూడి విషయంలో మరోసారి రుజువైంది.
1995 లో అందుకున్న రాజాలక్ష్మీ సాహితీ పురస్కారం తప్ప ఆయన సామర్ధ్యాన్ని చాటే ఇతర అవార్డులు లేవు.
జ్ఞానపీఠ్ లాంటి గౌరవాలు దక్కకపోతేనేం, సాహితీ ప్రియుల హృదయ పీఠాల్లో ముళ్ళపూడి శాస్వతంగా పీఠం వేసుకు కూర్చుంటారు. ముళ్ళపూడి మరి లేరు. కానీ ఆయన రాసిన హాస్య గుళికలు మట్టుకు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. రేపటి తరాలని కూడా అలరిస్తాయి.
|