diwali | deepavali | deewali | laxmi pooja | lakshmi puja | crackers | recipes | sweets | pooja vidhanam video | diwali articles | narakasura vadha | ravanasura | satyabhama | krishna | laxmi | lakshmi | vinayaka | aha emi ruchi | video recipes
దివ్వె కాంతుల దీపావళి - అష్టలక్ష్మీ అనుగ్రహ కేళీ

దీపావళి పండుగ సంబరాల వెనుక రకరకాల పురాణ గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ నరకాసురుడి కథే చాలా మందికి తెలుసు. నరకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొందిన గర్వంతో విర్రవీగుతూ అనేక ఆకృత్వాలకు పాల్పడుతుంటాడు. ఇంద్రుడ్ని ఓడించి ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు. అంతటితో ఆగకుండా పదహారు వేల మంది కన్యల్ని చేరపడతాడు. రోజు రోజుకీ పెరిగిపోతున్న నరకాసురుని ఆకృత్వాలను సహించలేని సత్యభామ ఆ రాక్షడుని సంహరించే అవకాశం తనకు ఇవ్వమని భర్త శ్రీ కృష్ణుణ్ణి కోరుతుంది. ఆమె కోరికను శ్రీ కృష్ణుడు మన్నించడంతో పాటు ఆమె రథానికి సారధిగా మారతాడు. నరకాసురునితో కొన్ని రోజుల పాటు

divve kaanthula deepavali

ఘోర యుద్ధం చేసిన అనంతరం సత్యభామ నరకాసురున్ని అంతం చేస్తుంది. నరకాసురుడు అంతమొందిన శుభ్తరుఅనాన ప్రజలు తమ తమ ఇళ్ళల్లో దీపాలను వెలిగించుకొని పండుగ చేసుకున్నారు. ఈ కథ ద్వాపర యుగం నాటిది అయినా ఈ రోజుకీ దీపావళి రోజున సత్యభామా శ్రీకృష్ణలను తలచుకుంటూ ఆనందిస్తున్నాం. మన రాష్ట్రంలో రెండు రోజులు మాత్రమే దీపావళిని జరుపుకుంటాం నిజానికి ఇది అయిదు రోజుల పండుగ.
ఆశ్వీయుజ బహుళ త్రయోదశినాటి రాత్రి అపమృత్యు నివారణార్థం దీపం వెలిగించి ఇంటి ముందు పెడతారు. దీన్నేయమదీపం అని పిలుస్తారు. యముని అనుగ్రహం కొరకు ఈ దీపం వెలిగిస్తారు. చతుర్థశి నాడు తెల్లవారుజామునే తలంటు స్నానం చేసిన అనంతరం యమునికి తర్పణ వదులుతారు. ఆయనకీ ఉన్న పధ్నాలుగు పేర్లను తెలిపే మంత్రంతో అయ్ముడిని పూజిస్తారు.
"యమాయ ధర్మరాజాయ
వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షమాయ చ
ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
వృకోదరాయ చిత్రాయ చిత్ర గుప్తాయవై నమ:"
ఈ విధంగా ప్రార్థిస్తూ యమతర్పణం విడిచిన వెంటనే ఓ దీపం వెలిగిస్తారు. ఆ రోజు సాయంకాలం ఇంట్లోనూ, దేవాలయాల్లోనూ దీపాలను వెలిగిస్తారు. శ్రీ కృష్ణదేవరాయల వారి కాలంలో దీపావళి అత్యంత వైభవంగా జరిగేది. ఆయన చతుర్థశి నాడు తెల్లవారు జామునే లేచి ఆయన పురోహితుల ఆశీర్వాదం పొందేవారు. ఆ తరువాత మంగళ స్నానం చేసి, దర్భారులో నృత్యగానంతో ఆనందించి అందరికీ బహుమతులు అందజేసేవారు. రాత్రి వేళ టపాకాయలు కాల్చేవారు. నగరంలోని ప్రజలందరూ ఇదే విధంగా దీపావళిని జరుపుకునేవారు.

మంగళహారతి:
అమావాస్య నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి మంగళస్నానాలు చేస్తారు. ఆ తరువాత స్త్రీలు తమ సోదరుఅలకు మంగళ హారతులు ఇస్తారు. ఆ రోజు సాయంత్రం దీప దానం చేస్తారు. అనంతరం లక్షీపూజ చేస్తారు. దేవాలయాల్లో, నాలుగురోడ్ల కూడలిలో దీపాలను వెలిగిస్తారు. దొన్నెలలో దీపాలు పెట్టి నీటిలో వదులుతారు.
అర్థరాత్రి వేళ స్త్రీలు చేతలు, తప్పెటలు వాయిస్తూ జ్యేష్ఠా దేవిని తరుముతారు. ఈ ఆచారం ఇప్పుడు అన్ని ప్రాంతాలలో లేకున్నా కొన్ని ప్రాంతాలలో స్త్రీలు తమ ఇంట్లోనే చేతల్ని గంటల్ని ఒకసారి దులిపి కొట్టే అలవాటు ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఉంది.
లక్ష్మీపూజ:

లక్ష్మీదేవి పూజ దీపావళి పండుగలో ఒక ప్రధానాంశం. పురాణాల్లో లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి ఓ కథ ఉంది. లోకసంచారం చేస్తున్న దుర్వాసమహామునికి విద్యాధరి తారస పడింది. ఆమె చేతిలో ఉన్న పూలచెండు తనకు కావాలని దుర్వాసుడు విద్యాధరిని అడిగాడు. ఆమె దాన్ని ఆ మునికి ఇస్తుంది దాన్ని తీసుకువెళ్ళి దుర్వాసుడు ఇంద్రుడికి బహుకరించాడు. ఆ సమయంలో పరధ్యానంగా ఉన్న ఇంద్రుడు ఆ పూలచెండును ఐరావతం మీదికి జార విడిచాడు.

దాని సువాసనకు పరవశించిన ఐరావతం ఆ చెందును కాళ్ళతో తొక్కి ఆనందించింది. ఈ విషయం తెలుసుకున్న దుర్వాసుడు కోపోద్రిక్తుడై ఉండ్రుడిణి శపించాడు. ఆ శాప ఫలితంగా ఇంద్రుడు అసురాల చేతిలో ఓడిపోయి, రాజ్యం కోల్పోయాడు. దిక్కుతోచని సితిలో ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకొన్నాడు. వీరిద్దరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లి ఈ కష్టాన్ని గట్టెక్కించమని ప్రార్థించారు. పాల సముద్రం కుమార్తెగా జన్మిచి దేవతలకు ఆశీస్సులు ఇవ్వమని విష్ణువు లక్ష్మీదేవిని ఆదేశించాడు .
క్షీరసాగర మథనంలో కామధేనువు, పారిజాతం, అప్సరసలు, ధన్వంతరి, హాలాహలం, చివరిగా లక్ష్మీదేవి ఆవిర్భవించారు.
"లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ దామేశ్వారి..." అంటూ దేవతలు, "నమస్తేస్తు మహామాయే శ్రీ పీటే సురపూజితే శంఖ చక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే" అంటూ దేవేంద్రుడు, "హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రాజప్రజామ్ రంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమావాహ" అంటూ శ్రీసూక్తం తో దేవతలు ఆమెను స్తుతించారు. గంగాది నదులు దేవతా రూపాల్లో ఆమె చేలికట్టేలుగా వెలికి వచ్చాయి. దిగ్గజాలు స్వర్నకుంభాల్లో ఆమెకు స్నానం చేయించారు. విశ్వాకారం ఆభరణాలు తయారు చేశాడు. క్షీర సాగర పద్మాలదండని ఆమెకు తన వక్ష స్థలం మీద స్థానమిచ్చాడు. విష్ణుమూర్తి వక్ష స్థలవాసి అయిన లక్ష్మీ అంటే "సంపద" అని అర్థం. సంపదను లక్ష్మీదేవిగా భావించి పూజించడం అనాదిగా వస్తున్నా సంప్రదాయం. ధర్మబద్ధంగా సంపాదన, అదే మార్గంలో ఖర్చు ఉండాలని లక్ష్మీ పూజ మనకు ప్రబోధిస్తుంది.
బలిఫాడ్యమి:
అమావాస్య మర్నాడు కార్తీక శుద్ధ పాడ్యమి "బలి పాడ్యమి" అని అంటారు. ఈ రోజు అభ్యంగ స్నానం తప్పనిసరిగా చేయాలి. రకరకాల ముగ్గులతో ఇంటిని అలంకరించి, బలిచక్రవర్తిని, ఆయన భార్య విద్యావతిని పూజిస్తారు. బలిచక్రవర్తిని పూజించిన అనంతరం దానం ఇస్తే లక్ష్మీదేవి ఎక్కడికి పోకుండా ఆ ఇంట కొలువుంటుదంటారు. ఏడాదికి ఒకసారి బలిచక్రవర్తి లోకసంచారానికి వస్తాడనీ, ఆ రోజు ప్రజలందరూ ఆయనకు వెలుగులతో స్వాగతం చెబుతారని శ్రీమహావిష్ణువు అనుగ్రహిస్తాడు. ఆ రోజు పల్లెల్లో కొందరు బలులిచ్చి కాగడాలు వెలిగిస్తారు.
"సంవత్సరానికి ఒకసారి బలి భూలోకానికి వచ్చి వెలుగును పొందవచ్చని, ఆనాడు ప్రజలు ఆయనకు దీపాలతో స్వాగతం చెబుతారనీ" శ్రీ మహావిష్ణువు వరమిస్తాడు. పాతాళలోకం వెళ్ళిన బలి చీకతిలోకంలో కూడా హరినామస్మరణ వీడకపోవడం చూసి లక్ష్మీదేవి హృదయం ద్రవించిపోయింది. అతనికి వెలుగును ప్రసాదించమని శ్రీమహావిష్ణువును కోరగా పై విధంగా వరమిచ్చాడు. ఇది బలిఫాడ్యమి వెనుక ఉన్న కథ.
భ్రాతృ ద్వితీయ:

ఈ రోజు చెల్లెలి ఇంటికి అన్న వెళ్లి విందారగించే రోజు కనుక దీనిని "భగినీ హస్త భోజనం" అని పిస్తారు. స్త్రీలు తమ అన్నదమ్ములకు భోజనానికి పిలిచి, వారికి కొత్త బట్టలు బహూకరించి, నోసటన తిలకం దిద్దుతారు. శతాబ్దాలుగా వస్తున్నా ఆచారం ఇది.

కౌముది మహోత్సవం:
దీపావళికి కౌముది మహోత్సవం అని మరొక పేరుంది. కౌముది అంటే వెన్నెల అని అర్థం. కార్తీక మాసం వెన్నెల మాసం అని అంటారు. జైన మాట ప్రవక్త మహావీరుడు దీపావళి అమావాస్యనాడు నిర్యాణం చెందాడనీ, దేవతలు ఆయనను పూజించి, దీపాలు వెలిగించారని, ఈ కారణంగా దీపావళి నాడు దీపాలు వెలిగించడం ఆచారమయిందని మరొక కథ కూడా ప్రచారంలో ఉంది.
నరకాసురుడి దగ్ధం:
మన తెలుగు ప్రాంతంలో నరక చతుర్దశి నాడు గడ్డితో, కాగితాలతో నరకాసురుని బొమ్మ చేసి దాన్ని ఊరేగించి అనంతరం ఊరిబయట దాన్ని తగలబెడతారు. తిరిగి వచ్చిన తరువాత అభ్యంగన స్నానం చేసి, మతాబులు, టపాకాయలు కాలుస్తారు. అమావాస్య నాటి సాయంకాలం ప్రమిదల్లో వత్తులు వేసి దీపాలు వెలిగిస్తారు. దీపం వెలగడమే ప్రధానం అనుకుని నేడు కొందరు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. ఇది మంచి పధ్ధతి కాదు. నూనె దీపమే శ్రేష్టమైనది.
జ్ఞానానికి సంకేతం:
దీపం జ్ఞానానికి సంకేతం అంటారు. చీకటిని తిట్టుకుంటూ బాధపడకుండా, చిన్న దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం చీకటిని పారద్రోలి జ్ఞానమనే కాంతిని ఇస్తుంది. చీకటి అజ్ఞానానికి సంకేతమైతే వెలుగు జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విధంగా ఈ ఋతువులో దీపాలను వెలిగించడంలో ఓ పరమార్థం ఉంది. వర్షఋతువులో వాతావరణంలో చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు వీచే గాలిని పీల్చినట్లయితే,
రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చేడుగాలిని శుభ్రపరచడానికి దీపాలు వెలిగించి టపాసులు పేల్చడం చేస్తారు. ఒకే సమయమ్లో దేశమంతా టపాసులు పేల్చడం వలన వాయు శోధన జరిగి రోగాలు ప్రబలే ఆనవాళ్ళు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా దీపావళి నాడు టపాసులు కాల్చడం అన్నది ఆచారంగా మారింది.
త్రేతాయుగంలో:
ద్వాపర యుగంలో నుంచి దీపావళి పండుగ మొదలైంది అన్న విషయం చాలా మందికి తెలుసు. వాస్తవానికి ఈ పండుగ త్రేతాయుగం నుండే ప్రారంభం అయింది. రావణాసురుడిని సంహరించి 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకొని రాముడు సీతాసమేతుడై లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు పయనమయ్యాడు. రాముడి రాకను తెలుసుకున్న అయోధ్యావాసులు ఆయనకి నెయ్యితో చేసిన దీపాలు వెలిగించి దారి పొడుగునా స్వాగతం పలికారు. అంటే కాకుండా దక్షిణాది నుంచి రాముడు ఉత్తరాదిన ఉన్న అయోధ్యకు వచ్చాడు. ఈ కారణంగా ఉత్తరాది వారి కన్నా దక్షిణాది వారు ఒకరోజు ముందు దీపావళిని జరుపుకుంటారు. సాధారణంగా దసరా పండుగ వెళ్ళిన 19 లేక 20 రోజుల తరువాత దీపావళి వస్తుంది.
నాగార్చన:
కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ చవితినే నాగుల చవితి అంటారు. ఈ రోజు ఉదయాన్నే ఇంటిల్లిపాదీ లేచి, తలస్నానం చేసి పుట్టవద్దకు వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి, నాగేంద్రుని అనుగ్రహం పొందాలి. ముఖ్యంగా కన్నె పిల్లలు, సంతానం కావాల్సిన మహిళలు భక్తిశ్రద్ధలతో నాగేన్ద్రున్ని పూజిస్తే
మంచి భర్త, చక్కని సంతానం లభిస్తుందని ప్రతీతి. నాగేంద్రుని ఇష్టమైనవి ఆవుపాలు, కోడిగ్రుడ్డు, చలిమిడి, వడపప్పు వీటిని పుట్టలో వేసి నమస్కారం చేయాలి. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహా నాగారూపాయ వరదాయ చ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ నాగులకు పాలుపోసి, నాగపూజ, ఆశ్వత్ధనారాయణ ప్రదక్షిణాలు చేయాలి.
వృశ్చికరాశిలోని జ్యేష్ఠ నక్షత్రానికి సర్ప నక్షత్రమనే పేరు ఉంది. ఈ సర్ప నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడే నాగులచవితి వస్తుంది.
మన శరీరం ఒక వల్మీకం. అనగా తొమ్మిది రంధ్రాలు కలిగిన పుట్ట. ఈ వల్మీకం అడుగున మూలాధారంలో శయనించి ఉండే నాగమే కుండలినీ శక్తి. ఈ నాగమే ప్రతి జీవియండు కామ క్రోథములానే విషాన్ని కక్కుతూ ఉంటుంది. అటువంటి విషాన్ని హరించే సత్వగుణమునకు పాలు పోయడమే నాగులచవితిలోని అంతరార్థం. ఈ పండుగ రోజున పాలు పోయడం వల్ల మనలో ఉన్న విషసర్పం తెల్లని ఆదిశేషునిగా మారి, మనలోనే ఉన్న విష్ణు భగవానునికి శయ్యగా ఏర్పడుతుంది. ఈ సాధనే నాగుల చవితి పండుగ.
బాణాసంచా సంబరాలు:
దీపాలు వెలిగించి పండుగ జరుపుకునే దీపావళిలో క్రమేణా పూల దివిటీలు, టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు వంటి బాణాసంచా కూడా వచ్చి చేరాయి. మన దేశంలో కుల మతాలకు అతీతంగా దీపావళిని జరుపుకుంటారు. విదేశాల నుండీ దిగుబడి కాబడిన టపాకాలకే సీమ తపాకాయాలని పేరు వచ్చింది. టపాకాయలు, బాణాసంచాను తొలుత చైనావారు కనిపెట్టారు.
కాలక్రమేణా మరింత వెలుగును నింపుకున్న దీపాల పండుగ కన్నుల పండుగ అయ్యింది. అయితే డబ్బును ఇలా టపాకాయాల రూపంలో వృథా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశించేవారూ ఉన్నారు. వీరి మాట నిజమే అయినప్పటికీ కొన్ని ఆనందాలు డబ్బుతోనే లభ్యం కావు కదా అందుకే బాణా సంచా ధరలు ప్రతి ఏటా ఆకాశాన్ని అంటుతున్నా వాటిని దీపావళినాడు కాల్చి ఆనందించేవారు పెరుగుతూనే ఉన్నారు.