Facebook Twitter
ఏమిటీ రక్తపాతం..?ఎందుకీ రాక్షసత్వం..?

అయ్యో...!  అయ్యో...!
చేతులకు సంకెళ్లు వేసి
నిస్సహాయురాలిని చేసి
పంటపొలాల్లోకి ఈడ్చుకెళ్ళి
సామూహికంగా మానభంగం చేసి
చిత్రహింసలుపెట్టి శీలాన్ని దోచుకొని

ఒంటరిని చేసి...అలా బండరాళ్లతో
ఇనుప రాడ్లతో...తలపై మోదుతుంటే
ఏడ్చిఏడ్చి రక్షించమని అరిచి అరిచి
రక్తపుమడుగులో గిలాగిలా కొట్టుకొని
ప్రాణాలు వదిలిన ఆ అమాయకపు
అమ్మాయి ఏ నేరం చేసిందని ..?
ఎందుకంత కసి..?
ఎందుకంత ద్వేషం...?
ఏమిటీ ఆ కౄరత్వం...?
ఏమిటీ ఈ రాక్షసత్వం...?
ఎవరి మద్దతుతో ..?
ఎవరి మెప్పుకోసం ..?
ఇంతటి దారుణానికి
ఒడిగట్టాడు కరుణ దయ
జాలిలేని ఆ కసాయివాడు
ఆ రాతిగుండెల రాక్షసుడు...

ఆ ఒంటరి అమ్మాయిని
అంతగా అమాషంగా
హింసించి హింసించి
చంపుతున్నప్పుడు...
ఒక్కసారైన వాడి అమ్మ అక్క
చెల్లి కూతురు భార్య గుర్తుకు రాలేదా..?

చూస్తుంటే రక్తం మరుగుతోందే...
వాడు మనిషా..? మానవ మృగమా..?
ఎటు పోతోంది నా దేశం...
ఏమిటీ ఈ దుర్మార్గం...?
ఏమిటి నడిరోడ్ల పై ఈ నరమేధం..?

అదిగో నా తల్లి భారతమాత
మణిపూర్ లో జరిగే ఆ ఘోరాలు
ఆ నేరాలు ఆ దారుణాలు కళ్ళతో
చూడలేక  వెక్కి వెక్కి ఏడుస్తోంది...

తనను కడుపు కోతకు గురిచేయవద్దని
ఈ రాక్షసత్వాన్ని ఈ రక్తపాతాన్ని
మణిపూర్ లో జరిగే ఈ మారణహోమానికి
తక్షణమే ఆపమని స్రీలను రక్షించమని...
మహిళల మాన ప్రాణాలను కాపాడమని
అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన
పాలకులను సుప్రీంకోర్టున్యాయమూర్తులను
మహిళాకమీషన్ సభ్యులనువేడుకుంటుంది