Facebook Twitter
మణిపూర్… ఆరని ఒక అగ్ని గుండం..?

అంబేద్కర్
అందించిన
రాజ్యాంగంలోని
ప్రాథమిక హక్కులకు
భంగం కలిగించమని...
నిరుపేదల ఇళ్ళను దగ్ధం చేయమని...
నిస్సహాయురాళ్ళైన మహిళలను
వివస్త్రలను చేసి వీధిలో ఊరేగించమని...

ఆకులు మేసే
మేకలమందలో 
తోడేళ్ళు దూరినట్లు...
బెదురు చూపుల జింకలమీద
పులులు సింహాలు దాడిచేసినట్లు...
మారణాయుధాలతో
నిరాధీయుల మీద విరుచుకుపడి
దారుణంగా హింసించి హింసించి
మారణహోమాలు సృష్టించమని..!

రాజ్యాంగమే
మనకు రక్షణ కవచమని...
ప్రజాస్వామ్యంలోనే ప్రజలు
సురక్షితంగా‌ నిద్రిస్తారని...
సుభిక్షంగా బ్రతుకుతారని...
సుఖశాంతులతో ఉంటారని...
భిన్నత్వంలో ఏకత్వానికే
కట్టుబడి ఉంటామని...
దానవత్వాన్ని దగ్ధం చేస్తామని..

ప్రతి మనిషి గుండెను
గుభాళించే కరుణ దయ ప్రేమ
పరిమాళాలతో నింపుతామని...
నేటి మానవత్వమే... రేపటి
దైవత్వమన్న సత్యాన్ని విశ్వసిస్తామని..!

పవిత్ర గ్రంథాలైన
బైబిల్ భగవద్గీత ఖురాన్ లమీద
నేడే ప్రమాణం చేద్దాం...!
తల్లిభారత పాదారవిందాలకు
ప్రణమిల్లి ప్రతిజ్ఞ చేద్దాం...?

అందుకే
ఓ సమతావాదులారా రండి..!
మణిపూర్లో..."ఆరని మంటలు"
ఆర్పుదాం..! రండి..!
ఈ నరజాతికి..."శాంతి పాఠాలు"
నేర్పుదాం..! కదలి రండి..! కలిసి రండి..!