Facebook Twitter
ఖరీదైన (రెండులక్షల) త్యాగం..!

అనగనగా
ఒక పొదుపరి...
ఒక మదుపరి...
దూరదృష్టిగల
పక్కాలెక్కల మనిషి...
"ఉదార హృదయుడే"
కానీ పరుల దృష్టిలో
పాపం "పరమ పిసినారి"

ఆ పిసినారి మనిషి
పేదవాడిగా పుట్టినోడు...
కష్టం విలువ ఎరిగినోడు...
ధనం విలువ తెలిసినోడు...

"రెండులక్షలు" ఖర్చు చేశాడు...
మా విహారయాత్రల కోసం...
మేము తొలిసారి విమానాలెక్కి
విదేశాలలో విహరించడం కోసం...

నిజమే కళ్ళు చెదిరే ఈ
అందమైన అతిసుందరమైన
అత్యంత ఆశ్చర్యకరమైన
మలేషియా భవనాలను
ఎత్తిన తలను దించక
ఒళ్ళంతా కళ్ళుచేసుకొని చూసేందుకు...
ఈ రెండుకళ్ళు చాలవు...వేయి కావాలి...

ఔరా ఇదికదా "స్వర్గ సీమంటే"
అనిపించే ఆ ఆకాశ హార్మ్యాలను
తిలకిస్తుంటే...మది పులకిస్తుంటే...

అంతులేని ఆత్మ తృప్తి...
అనంతమైన ఆనందం...
వర్ణించతరం కాదే ఏకవికైనా

ఈ ఎత్తైన భవనాల మధ్య
తిరుగుతూ వున్నంత సేపు...
ఇప్పటికిక మా జన్మ ధన్యమే...
మరో జన్మంటూ ఉంటే
ఇక్కడే జన్మించాలని...
ఆ భగవంతున్ని కోరుకోవాలి...

ఔను నిజంగా ఇది
మా సంతోషం కోసం...
మా మనశ్శాంతి కోసం....
మా ఇద్దరి వినోదం కోసం...
మా మానసికానందం కోసం...
"మా పిసినారి" మాకు అందించిన
గొప్పఅదృష్టమే అపూర్వమైన అవకాశమే
మరిచిపోలేని...ఒక మధురానుభూతియే...

ఇది జీవితాంతం
వీడని మా నీడై మా వెంటే ఉంటూ
గుర్తుకు వచ్చిన ప్రతిసారి
మా మదిని పులకింప జేస్తుంది
తేనె కంటే తీయనైన...
మామిడి రసం కంటే...
మధురాతి మధురమైన ఈ తీపి జ్ఞాపకం...

ఔను ఇది చాలా చాలా "ఖరీదైన త్యాగం"...
ఈ త్యాగానికి చూపాలి విజ్ఞత...కృతజ్ఞత...
అప్పుడు కదా...
ఈ నర జన్మకు ఒక అర్థం పరమార్థం...
ఇకనుంచి మా పిసనారికి
పేరు మార్చాలి "మా బంగారు కొండని"...
నేడే ప్రమాణం చేయాలి...ఈ కొండకి
మేము జన్మంతా ఋణపడి ఉంటామని..