ప్రతి మనిషిలో
"దైవత్వం"
మొలకెత్తేదెప్పుడు..?
గుండె గుండెలో
"మంచితనం"...
"మానవత్వం"...
చినుకై రాలినప్పుడు..!
చిరుజల్లై కురిసినప్పుడు..!
ఈ మనిషి
ఒక మృగంలా...
మూర్ఖుడిలా...
ఒక రాక్షసుడిలా...
రాబందులా...
ఒక పశువులా...
విచ్చలవిడిగా
ప్రవర్తించేదెప్పుడు..?
మనిషిలోని ఆలోచనలు
మలినమైనప్పుడు..!
మానవత్వమన్నది
మంటకలిసినప్నుడు..!
కానీ మచ్చలేని...
స్వచ్ఛమైన మనసే కదా
అపురూపమైన ఆహ్లాదకరమైన
అనురాగ రాగాలను ఆలపించేది...
చల్లగా సాగే ఆ
"చల్లని గాలులే" కదా
మనసుకు హాయిని
ఆనందాన్ని అందించేది...
ఆగిపోయి అల్లరి చేసే...
ఆ "పిల్లగాలులే" కదా
ఉక్కపోతతో మనిషిని
ఉక్కిరిబిక్కిరి చేసేది...
ప్రభాత వేళలో
వెచ్చని..."నీరెండే" కదా
అలసిన మనసుకు
అంతులేని ఉత్సాహాన్ని...
ఉల్లాసాన్ని...అందించేది...
ఉయ్యాల జంపాలలూగించేది...
భగ్గుమనే ఆ
మధ్యాహ్నపు
మండుటెండలు...
వీచే వడగాల్పులే...కదా
మృత్యువు చేతిలో
మారణాయుధాలు...
ఔను
ప్రకృతిలోని
ఆ పంచభూతాలు..
మదిలోని అరిషడ్వర్గాలే...
మనిషి పతనానికి...
పురోగమనానికి...పునాది రాళ్ళు



