Facebook Twitter
కలలు కలతనిద్ర....

కడలన్నాక......అలలు
కనులున్నాక...పీడకలలు
తప్పవంటారు ఆశాజీవులు

ఔను మనం గాఢనిద్రలో
కమ్మని కలలెన్నోకంటాం
కొన్ని పిచ్చి...పీడకలలు
కొన్ని వెర్రి...వేధించే కలలు
కొన్ని భయానకమైనవి
పిశాచుల్లా పీడించే కలలు
ఎవరో ఎదపైకి ఎక్కితొక్కి
పీకను పిసికినట్లు ఊపిరాడక
ఉక్కిరిబిక్కిరయ్యే కలలు...

కొన్ని పగపట్టిన పాముల్లా
వెంటపడి కాటువేసే కలలు...
కొన్ని తలాతోకాలేని తలతిక్కకలలు
కొన్ని తల కాళ్లు చేతులు నరికేసినట్లు
భయంతో గజగజ వణికించే కలలు...
కొన్ని తాళ్లతో గట్టిగా కట్టినట్లు 
రాళ్లతో కొట్టినట్లు గన్నుతో కాల్చినట్లు
ఎత్తైనప్రదేశం నుండి
ఏ లోయలోకో  ఏ నీళ్ళలోకో
నిప్పుల్లోకో నెట్టేసినట్లు కలలు...

కొన్ని రాత్రాంతాఎవరో
కత్తులతో పొడిచినట్లు... 
గండ్రగొడ్డళ్లతో నరికినట్లు...
రక్తం ఏరులైపారుతున్నట్లు...
రాసి రంపానపెట్టే రాక్షసకలలు...
కొన్ని మనల్ని ఒక ఆట
ఆడించే ఓడించే పీడించే కలలు...

కొన్ని మనకు సంబంధంలేని
వారితో క్రీడించినట్లు కనే
బంగారపు శృంగారపు కలలు...
ఒక్కసారి మనం ఉలిక్కిపడి
కళ్ళురెండు తెరిచి చూస్తే చాలు 
మళ్ళీ ఆ పాత ప్రపంచమే...
కళ్ళకు గోచరించేది ఆ పాడులోకమే...

కానీ రాత్రంతా చిత్రమైన విచిత్రమైన
ఓ వింతలోకంలో విహరించి వుంటాం
ఇలా వింత వింతగా కలలుగని నిద్ర లేస్తే...
ఇక ఆరోజు బుర్రనిండా భూతాలే